
రెవెన్యూ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూనే వున్నారు. తాజాగా జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ అనే రైతు తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు.
రోజులు గడిచినా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో స్థానిక తహసీల్దార్ సునీతను ఆశ్రయించాడు. రూ.5 లక్షలు లంచం ఇస్తేనే భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్‌తో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం మేరకు తొలి విడతగా రూ.2 లక్షలు లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తహసీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.