ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh Karampoori  |  First Published Apr 1, 2024, 4:28 AM IST

RS Praveen Kumar Biography: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ నియోజకవర్గ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్‌.ఎస్.‌ ప్రవీణ్‌కుమార్‌ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం మీ కోసం 


RS Praveen Kumar Biography: సంచలనాలు, సంస్కరణలకు కేరాఫ్ మాజీ ఐపీఎస్‌ అధికారి రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్‌ అలియస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఇటీవల బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసినా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్‌.ఎస్.‌ ప్రవీణ్‌కుమార్‌కు పార్టీ అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం మీ కోసం..

బాల్యం, విద్యాభ్యాసం

Latest Videos

రేపల్లె శివప్రవీణ్ కుమార్ అలియస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ 1967 నవంబర్ 23న తెలంగాణలోని  జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఆర్ఎస్ ప్రేమమ్మ-బీఆర్‌ సవరన్న. ఇక ప్రవీణ్ కుమార్ బాల్యమంతా నల్లమల అడవి ప్రాంతంలోనే సాగింది. ఆయన పాఠశాల విద్య స్థానిక జిల్లాలోనే సాగింది. ఆ తరువాత హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వెటర్నరీ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని హార్వర్డ్, మసాచుసెట్స్‌ వర్సిటీల్లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశాడు

పోలీసు ఆఫీసర్ గా 

ఉమ్మడి రాష్ట్రంలోని కరీంనగర్, అనంతపూర్‌ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్‌), జాయింట్‌ సీపీ (స్పెషల్‌ బ్రాంచ్‌), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. ఇందులో ముఖ్యంగా 2001 నుంచి 2004 వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పని చేసినప్పుడు ఆయనకు ఎనలేని గుర్తింపు లభించింది. అందుకు కారణం ఏమిటంటే.. ఒకవైపు నక్షలిజాన్ని అణిచివేసేందుకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు,తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. 


పోలీస్ వెబ్ సైట్ 
 
ఇక హైదరాబాద్ పోలీస్ నేర విభాగంలో డీసీపీగా పని చేస్తున్నప్పుడు పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకొని సీసీఎస్‌లో సైబర్‌ క్రైమ్‌ సెల్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఓ ఠాణా కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటి ఆధారంగా తర్వాత కాలంలో హైదరాబాద్, సైబరాబాద్‌లకు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ వెబ్సైట్ ప్రారంభానికి కూడా ప్రవీణ్ కుమార్ విశేషమైన కృషి చేశారు.

స్వెరోస్ ఏర్పాటు

గురుకులాల్లో చదివిన పూర్వ విద్యార్థులతో స్వెరోస్ (SWAEROES) సంస్థను ఏర్పాటు చేశారు. SWAEROES అంటే సోషల్ వెల్ఫేర్ ఏరోస్. ఈ సంస్థ ద్వారా గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం విరాళాలు సేకరించడం. వారి అభ్యుత్నతికి క్రుషి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. స్వేరోస్ కేవలం విద్యార్థుల అకడమిక్స్‌పై మాత్రమే దృష్టి పెట్టలేదు. కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, ఆటలలో విజయం సాధించడానికి తోడ్పాటు అందించింది. 

ఉద్యోగానికి రాజీనామా 

అయితే 2020 జూన్ లో ప్రవీణ్ కుమార్ ఐజి పదవి నుండి అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతిని పొందాడు. తన 26 ఏళ్ల సుదీర్ఘ పోలీస్ ప్రస్థానం తర్వాత ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పంతో తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావించారు. ఈ క్రమంలో 2021 జూలై 19న ఆయన తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 

రాజకీయ జీవితం

దళితులు, బహుజనులు రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేసే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో 8 ఆగస్టు 2021న బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేశారు.  2023 శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆయన సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ ఎన్నికల్లో కేవలం 40 వేల ఓట్లు మాత్రమే పొంది ఓటమి పాలయ్యారు.

దీంతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి 16 మార్చి 2024న పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఆ తరువాత  భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు పార్టీ అధినేత కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు

click me!