ఒకే సారి 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదు.. ఆచరణ సాధ్యం కాని హామీలు అవి: ఈటల విసుర్లు

By Mahesh KFirst Published May 7, 2022, 5:08 PM IST
Highlights

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఫైర్ అయ్యారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఆచరణకు యోగ్యం కానివని, అమలుకు సాధ్యం అయ్యేవాటినే హామీలుగా ఇవ్వాలని రైతులే కోరుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫి సాధ్యం కాదని, ఈ విషయాన్ని తాను ఒక ఆర్థిక మంత్రిగా చెబుతున్నారని పేర్కొన్నారు.
 

కరీంనగర్: రాహుల్ గాంధీ సభపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సభను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. అదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీపైనా విమర్శలు చేశారు. మోసం చేసేది కేంద్ర ప్రభుత్వం కాదనీ, కేసీఆర్ ప్రభుత్వమేనని రైతులకు కూడా తెలిసిపోయిందని ఈటల అన్నారు. కాంగ్రెస్‌ను అటాక్ చేస్తూ.. వరంగల్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణకు సాధ్యం కానివని కొట్టిపారేశారు. ఒకే సారి రూ. 2 లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కాదని అన్నారు. ఒక మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా చెబుతున్నానని నొక్కి పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అయినా రుణమాఫీ ఇంకా చేయలేదని పేర్కొన్నారు.

వరంగల్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణకు యోగ్యం కానివని వివరించారు. అందుకే ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇవ్వొద్దని రైతులే కోరుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు సాయం చేయాలనే తాను కోరుకుంటున్నానని, కానీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలో అసలు క్లారిటీ లేదని అన్నారు. ఎకరానికి రూ. 15 వేలు ఒకేసారి ఇస్తారా? లేక మొదటి పంటకి ఇస్తారా? రెండో పంటకు ఇస్తారా? అనేది క్లారిటీ లేదని వివరించారు. ఏది చేయగలరో.. వారితో ఏది సాధ్యం అవుతుందో అవే చెప్పాలని అన్నారు.

Latest Videos

టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు నాలుగు సార్లు మ్యానిఫెస్టో రాయడంలో తాను భాగంగా ఉన్నారని ఈటల అన్నారు. కానీ, అది అమలు కాలేదని వివరించారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి. డబుల్ బెడ్ రూమ్‌లు లేవని పేర్కొన్నారు. ధనిక రాష్ట్ర అని చెప్పిన కేసీఆర్ నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. తాతలు సంపాదించిన ఆస్తులు అమ్ముకుని సోకులు చేస్తున్నట్టుగా కేసీఆర్ పరిస్థితి ఉన్నదని వివరించారు. లిక్కర్ ద్వారా వస్తేనే ఆదాయం లేదంటే లేదన్నట్టుగా ఉన్నది వ్యవహారం అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్‌కు
అసలు నిజాయితే లేదని, చేతగాని సీఎం తప్పుకోవాలని అన్నారు.

తన ఉనికి ఉండాలనే వేలాది మంది పొట్టకొట్టారని, అలా నిర్మించిన యాదాద్రిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ తానే స్వయంగా ఇంజనీర్ అని చెబుతుంటారని, అలా అయితే,  ఎన్నో సార్లు పర్యటించినప్పటికీ గుడి నిర్మాణంలో నాణ్యత లేదని చెబుతున్నారు. కేసీఆర్ నిజాం నవాబుల తమ్ముడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. తన ఉనికి ఉండాలనే సచివాలయాన్ని కూల్చి కొత్తది కడుతున్నారని వివరించారు. రూ. 1000 కోట్లు పెట్టి సచివాలయం నిర్మించడం అవసరమా? అంటూ ప్రశ్నించారు. అసలు ఆఫీసులకు వాస్తులు ఉంటాయా? అని అడిగారు.

click me!