
కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) తెలంగాణ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు (rythu sangharshana sabha) విచ్చేసిన రాహుల్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోనే బస చేశారు. అయితే అనూహ్యంగా ఆయన తెలుగు మీడియా అధినేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌తో (ravi prakash) , ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (abn andhra jyothi) ఎండీ వేమూరి రాధాకృష్ణతో (vemuri radhakrishna) రాహుల్ భేటీ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) దగ్గరుండి ఈ భేటీని పర్యవేక్షించినట్లుగా తెలుస్తోంది.
రాహుల్ బస చేసిన హోటల్ వద్ద మీడియా అధినేతల వీడియోలతో టీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేస్తోంది. తెలంగాణ వ్యతిరేక ముఠా అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ''తెలంగాణ వ్యతిరేక ముఠా మళ్ళీ ఒకటైంది .. రవి ప్రకాష్, రాధాకృష్ణను రాహుల్ గాంధీకి దగ్గరుండి కలిపించిన రేవంత్'' అంటూ టీఆర్ఎస్ ఘాటుగా ట్వీట్ చేసింది. తెరవెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ఛానల్, పత్రిక ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ హయాంలో 2009లో సాక్షి పత్రిక, ఛానెల్ ప్రారంభమయ్యాయి. వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ (ys jagan) సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి మీడియా సపోర్ట్ లేకుండా పోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు సొంతంగా ఓ చానల్ ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో మీడియా అధినేతలు భేటీ కావడం.. రేవంత్ దగ్గరుండి వారిని కల్పించడం ఆసక్తి రేపుతోంది.
వీటన్నింటిలోకీ రవిప్రకాష్ భేటీనే హైలైట్‌గా నిలుస్తోంది. కేసీఆర్ వల్లే తనను టీవీ9 నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టారనే కసితో రవి ప్రకాష్ ఉన్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు తెలంగాణలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని రవిప్రకాష్ పలుసార్లు ఆరోపించారు కూడా. తనపై నమోదైన కేసుల విషయంగా కోర్టులకు వెళ్లిన ఆయన విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న రవిప్రకాష్ .. కొంతకాలంగా కేసీఆర్ వ్యతిరేక శక్తులకు రవిప్రకాష్ సహకరిస్తున్నారనే ప్రచారం ఉంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాజకీయంగా రవిప్రకాష్ సలహాలు, సూచనలు ఇస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సైతం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏకంగా రాహుల్ గాంధీతో రవిప్రకాష్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించాలంటే ఏం చేయాలన్న కార్యాచరణపై రవిప్రకాష్‌తో రాహుల్ , రేవంత్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రవిప్రకాష్‌ను రాహుల్ ఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించినట్లుగా సమాచారం. మొత్తంగా రాహుల్ గాంధీతో రవి ప్రకాష్ చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. అటు రేవంత్ రెడ్డి వ్యూహ రచనపై కాంగ్రెస్ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారట.