నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఏటీఎంలు లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఏటీఎంలు లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా జిల్లాలోని వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లేందుకు దొంగలు యత్నించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తొలుత యూనియన్ బ్యాంకు ఏటీఎం వద్దకు చేరుకున్న దొంగలు.. ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి డబ్బును ఎత్తుకెళ్లాలని యత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే వారి ప్రయత్నం విఫలం కావడంతో.. మొత్తం ఏటీఎం మిషన్‌ను దొంగిలించేందుకు చూశారు.
ఈ క్రమంలోనే ఏటీఎం మిషన్‌ను పెకిలించి బయటకు తీసుకొచ్చారు. ట్రాక్టర్ ద్వారా ఏటీఎం యంత్రాన్ని అక్కడి నుంచి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇది గమనించిన కొందరు స్థానికులు.. గ్రామంలోని ఇతరులను కూడా అప్రమత్తం చేశారు. దీంతో దొంగలు.. ఏటీఎం మిషన్‌ను, ట్రాక్టర్‌ను అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆధారాలు సేకరించేందుకు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు.
ఇక, ఇటీవల నిజమాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారి పక్కనే గల ఎస్‌బీఐ ఏటీఎంలో కూడా చోరీ జరిగిన సంగతి తెలిసిందే.