
కరీంనగర్: శ్రావణ సోమవారం పర్వదినాన వేములవాడ రాజన్న దర్శించుకుందామని వెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహిళలు, చిన్నారులతో వెళుతున్న ఆటో ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఐదుగురికి తీవ్ర గాయాలవగా ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా పాలకుర్తి, ఇందిరానగర్ కు చెందిన కొందరు ఆదివారం రాత్రి వేములవాడకు బయలుదేరారు. శ్రావణ సోమవారం సందర్భంగా రాజన్నను దర్శనం కోసం ఒకరోజు ముందుగానే బయలుదేరారు. మహిళలు, చిన్నారులు ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగింది.
వీడియో
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామశివారులో రాత్రి 11 గంటల సమయంలో ఆటో ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఆటోను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న, చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలవగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే క్షతగాత్రుల నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.