మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లిలో విషాదం.. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల కూల్చివేత.. ఒకరి మృతి...

By AN TeluguFirst Published Aug 23, 2021, 8:36 AM IST
Highlights

ఎర్రవల్లిలో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల కూల్చివేత చేపట్టారు. గజ్వేల్ మండలం ముత్రాజ్పల్లి శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో ఉంటున్న బాధితులు ఈ విషయం తెలుసుకుని.. శనివారం రాత్రి ఎర్రబెల్లికి వచ్చి, తమ ఇళ్లలోని సామాన్లు సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు.

మెదక్ :  మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లిలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది.  రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టిన క్రమంలో విద్యుత్ స్తంభం మీద పడటంతో ఓ యువకుడు మృతి చెందాడు,

ఈ ఘటన వివరాల్లోకి వెళితే…  సిద్దిపేట జిల్లా కొండపాక,  తొగుట మండలాల సరిహద్దులోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి ఆదివారం తెల్లవారుజామున గోదావరి నీటి తరలింపునకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లిలో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల కూల్చివేత చేపట్టారు. గజ్వేల్ మండలం ముత్రాజ్పల్లి శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో ఉంటున్న బాధితులు ఈ విషయం తెలుసుకుని.. శనివారం రాత్రి ఎర్రబెల్లికి వచ్చి, తమ ఇళ్లలోని సామాన్లు సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ క్రమంలో ఆరె కనకరాజు (28) తన ఇంట్లో నుంచి సామాన్లను బయటికి తీస్తుండగా.. ఆ పక్కనే ఓ ఇంటిని కూల్చివేస్తున్న జెసిబి... సమీపంలోని విద్యుత్ స్తంభానికి బలంగా తగిలింది. దీంతో కరెంటు తీగలు తెగి పోయి కనకరాజు పై స్తంభం పడిపోయింది.  తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్లో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. ఇళ్ల కూల్చివేత పనులు ఎలా చేపడతారు అంటూ ఉస్మానియా ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు.  కనకరాజు కుటుంబానికి రూ. 20 లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ అధికారులు హామీ ఇచ్చే వరకు పోస్టుమార్టం చేయనివ్వం అంటూ పట్టుబట్టారు.  

గజ్వేల్ rdo విజయేందర్ రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడికి రెండున్నరేళ్ల కూతురు ఉంది.  భార్య శ్యామల నాలుగు నెలల గర్భవతి. 

click me!