కరోనాతో డాక్టర్ మృతి... మృతదేహాన్ని స్వగ్రామంలోకి అనుమతించని గ్రామస్థులు

By Arun Kumar PFirst Published Jul 16, 2020, 12:58 PM IST
Highlights

కరోనాలో మృతిచెందిన ఆర్ఎంపీ డాక్టర్ అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

నారాయణఖేడ్: కరోనాలో మృతిచెందిన ఆర్ఎంపీ డాక్టర్ అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అంత్యక్రియలకు కాదు కనీసం మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావడానికి కూడా గ్రామస్తులు అంగీకరించడం లేదు. ముందే కుటుంబసభ్యుడికి కోల్పోయి బాధలో వున్న సదరు ఆర్ఎంపీ కుటుంబం ఈ ఘటన మరింత కలచివేసింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు బుధవారం మృతిచెందాడు. 

దీంతో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కానీ గ్రామస్తులు కరోనాతో మృతిచెందాడన్న కారణంగా ఆర్ఎంపీ మృతదేహాన్ని అడ్డుకున్నారు. గ్రామంలో అంత్యక్రియలు జరపడానికి వేల్లేదన్నారు. 

read more  సిద్దిపేట ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం: ఐసీయూలోనే కరోనా రోగి డెడ్‌బాడీ

 ఇదిలా వుంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. బుధవారం రాత్రి వరకు కొత్తగా 1,597 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 39,342కి చేరింది. నిన్న కరోనాతో 11 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 386కి చేరుకుంది.

బుధవారం ఒక్క హైదరాబాద్‌లోనే 796 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత రంగారెడ్డి 212, మేడ్చల్ 115, సంగారెడ్డి 73, నల్గొండ 58, వరంగల్ అర్బన్ 44, కరీంనగర్ 41, పెద్దపల్లి 20, మంచిర్యాల 26, సిద్ధిపేట 27, సూర్యాపేట 14, నిజామాబాద్‌లో 13‌ మందికి పాజిటివ్‌గా తేలింది.

తెలంగాణలో 12,958 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇవాళ ఒక్కరోజే 1,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలిపి వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 25,999కి చేరింది. 

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడ ఉచితంగా కరోనా రోగులకు చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటె ఎక్కువ ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పలువురు ప్రభుత్వానికి పిర్యాదు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఇద్దరు డాక్టర్లు తమ బాధను సెల్పీ వీడియోల రూపంలో బయటపెట్టారు.  

కరోనా రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారని హైకోర్టు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో  ఉచితంగా కరోనా రోగులకు చికత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

click me!