రాజకోట రహస్యం ఏమిటి: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

By telugu teamFirst Published Jan 18, 2020, 4:40 PM IST
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెంలగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. మీ ఆస్తులు అంతగా ఎలా పెరిగాయని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.  కేటీఆర్ అవినీతి పై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. 111 జీవో పరిధిలో బినామీ పేరుతో రాజమహల్ కట్టుకున్నారని ఆయన ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో111 సమీక్షిస్తామంటున్నారని ఆయన చెప్పారు. 111 జీవో పరిధి నుంచి కొన్ని గ్రామాలు మినహాయింపు ఆలోచన వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. పుప్పాల గూడాలో రూ.30 కోట్ల విలువ చేసే ఆస్తి రూ. కోటికే ఎలా కొన్నారని ఆయన ఆరోపించారు.    
2014లో రూ.8 కోట్లు ఉన్న కేటీఆర్ ఆస్తి 2018కి రూ.41 కోట్లకు పెరగడం వెనుక రహస్యం  ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.    టీఆర్ఎస్ విరాళాలు రూ.188 కోట్లకు పెరగడం వెనుక రాజకోట రహస్యం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు.    

రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే... మీరు మాత్రం వేల కోట్లకు అధిపతులయ్యారని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు.    త్యాగాల తెలంగాణలో భోగాలు అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు... ఉద్యమాల తెలంగాణను మీరు చెరబట్టారని ఆయన వ్యాఖ్యానించారు.    

గచ్చిబౌలి, కోకాపేటల్లో వందల ఎకరాలు ఎలా సొంతమయ్యాయని ఆయన ఆరోపించారు. మీరు విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన కేసీఆర్ నుద్దేశించి అన్నారు.మీ అవినీతి బాగోతాల పై త్వరలో సమగ్ర వివరాలు, ఆధారాలతో పుస్తకం వేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

click me!