కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన శనివారం రాత్రి కుంగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన శనివారం రాత్రి కుంగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయపడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు తానే రూపొందించానని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని గొప్పలు చెప్పారని.. రైతులు, నాయకులకు బస్సులు పెట్టి ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లారని అన్నారు.అయితే వరదలు వచ్చి పంపు హౌంస్‌లు మునిగినప్పుడు కాంగ్రెస్ నేతలను చూడనివ్వలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉందని.. ప్రాజెక్టు డొల్లతనం ఇప్పుడు బయటపడిందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనేది సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని చెబుతూనే ఉన్నామని.. ఇప్పటికైనా కేంద్రం దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఖర్చుకు సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో దర్యాప్తు చేయించాలని కోరారు. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.