తెలంగాణ అస్థిత్వాన్ని చంపేశారు... కుటుంబ తగాదాల పరిష్కారం కోసమే బీఆర్ఎస్: రేవంత్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Oct 5, 2022, 4:13 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ పేరు మీద రాజకీయ మనుగడ, ఆర్థిక ప్రయోజనాన్ని  పొందిన కేసీఆర్.. ఇయాళ తెలంగాణ అస్థిత్వాన్ని చంపేశారని అన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ పేరు మీద రాజకీయ మనుగడ, ఆర్థిక ప్రయోజనాన్ని  పొందిన కేసీఆర్.. ఇయాళ తెలంగాణ అస్థిత్వాన్ని చంపేశారని అన్నారు. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి రుణం తీరిపోయిందని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందన్నారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్‌ఎస్‌ను స్థాపించారని విమర్శించారు. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. 

తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికే బీఆర్ఎస్ పెట్టారని విమర్శించారు. ఆ తరువాత కేసీఆర్ ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని.. తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. 

తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కేసీఆర్‌కు లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పుకొచ్చారు. 

Also Read: కేసీఆర్ ఆదిపురుష్.. బీఆర్ఎస్‌పై వర్మ ఆసక్తికర ట్వీట్.. పొగిడిరా?, సెటైర్ వేశారా?..

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పు, ఎజెండాను కేసీఆర్.. పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా పాల్గొన్నారు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత వారు శుభాకాంక్షలు చెప్పారు. 

అలాగే సర్వసభ్య సమావేశంలో..  పార్టీ రాజ్యాంగానికి అవసరమైన సవరణలు కూడా చేశారు. పార్టీ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలతో కూడిన తీర్మానాన్ని.. పార్టీ ప్రతినిధి బృందం భారత ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. పార్టీ పేరును మార్చాలని.. జాతీయ పార్టీగా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తును కూడా సమర్పించనుంది. 
 

click me!