Revanth Reddy: ఓటకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పిటిషన్ విచారించనున్న సుప్రీంకోర్టు

By Mahesh K  |  First Published Jan 5, 2024, 6:39 PM IST

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. వచ్చే నెల ఫిబ్రవరికి ఈ విచారణను వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఏసీబీ జ్యూరిస్‌డిక్షన్ కిందికి రాదని రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 


Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో విచారించనుంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి ఓ పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు మరికొన్ని పిటిషన్లు తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ పిటిషన్లను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారిస్తుండగా.. అందులో ఒక న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొందనే విషయం తెలిసింది. దీంతో ఆ పిటిషన్ల విచారణను ఫిబ్రవరి నెలకు వాయిదా వేశారు.

2015లో.. అంటే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు మొదలైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రూ. 50 లక్షల లంచం ఇవ్వజూపినట్టు ఆరోపణలు వచ్చాయి. తద్వార ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నామినీ వేమ్ నరేందర్ రెడ్డికి మద్దతు కోసం ఈ లంచం ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని ఏసీబీ పట్టుకుంది. మే 31వ తేదీన రేవంత్ రెడ్డి డబ్బు కట్టలతో పట్టుబడ్డారు. అప్పుడు రేవంత్ రెడ్డితోపాటు మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

Latest Videos

undefined

ఆ తర్వాత వారందరికీ బెయిల్ మంజూరైంది. 

Also Read: Yadadri Temple: యాదాద్రి ఆలయ హుండీకి రికార్డు విరాళాలు.. విదేశీ కరెన్సీ సైతం

2015 జులైలో రేవంత్ రెడ్డి, ఇతరులపై చార్జిషీటు దాఖలైంది. నిందితులకు సంబంధించి తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షల లంచం ఇస్తుండగా జరిగిన సంభాషణ ఆడియో లేదా వీడియో రూపంలో ఉన్నట్టు ఏసీబీ పేర్కొంది.

ఈ కేసులో దర్యాప్తు చేసే జ్యూరిస్‌డిక్షన్ ఏసీబీకి లేదని రేవంత్ రెడ్డి వాదించారు. ఇదే వాదనతో హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, ఆయన పిటిషన్ విచారణకు వచ్చింది. ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు విచారించనుంది. దీంతో కాంగ్రెస్ వర్గాలతోపాటు టీడీపీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

click me!