
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజులు తెలంగాణలో పర్యటించారు. ఈ రోజు పర్యటన ముగిసింది. ఆమె ఢిల్లీకి వెళ్లుతున్నారు. మూడు రోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆమెకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నీ టార్గెట్ చేశారు. ముఖ్యంగా నిర్మలా సీతారామన్‌పై విమర్శలు చేశారు. రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫొటో లేదని పంచాయితీ చేయడం కేంద్రమంత్రిగా మీ స్థాయికి తగినట్టు లేదని విమర్శించారు.
తెలంగాణలో కేంద్రమంత్రి ప్రవర్తిస్తున్న తీరు.. అందుకు ప్రతిగా రాష్ట్ర మంత్రులు వ్యవహరిస్తున్న విధానం కూడా అభ్యంతరకరంగా ఉన్నదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిర్మలా సీతారామన్ ఇలా వ్యవహరించడం దురదృష్టకరం అని తెలిపారు. 8 సంవత్సరాల్లో అటు కేంద్రం ప్రభుత్వం, ఇటు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆరోపణలు చేశారు.
రేషన్ కార్డుల మీద ప్రధాని ఫొటో కోసం పంచాయితీ పెట్టడం మీ స్థాయికి తగ్గట్టు లేదని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వీధి నాటకాలకు తెర లేపడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మీది కాదా? అంటూ ప్రశ్నలు సంధించారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వాటిని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే కదా.. అంటూ పేర్కొన్నారు.
జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మూలన పడ్డాయని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌తో కేంద్రానికి ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో బయట పెట్టాలని పేర్కొన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ అండ్ కో విషయంలో కేంద్రం ఎందుకు ఔదార్యం ప్రదర్శిస్తున్నదో తెలుపాలని డిమాండ్ చేశారు. మీ ఇద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో వెల్లడించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.