కాంగ్రెసుపై అసంతృప్తి: కోదండరామ్ టీజెఎస్ వైపు రేవంత్ రెడ్డి?

First Published May 10, 2018, 3:46 PM IST
Highlights

కాంగ్రెసు పార్టీ పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ జన సమితి (టిజెఎస్) వైపు చూస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ జన సమితి (టిజెఎస్) వైపు చూస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఇప్పటికే టిజెఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

రెండు మూడు రోజుల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తో భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలంగాణ జెఎసి నాయకులు చెబుతున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఓటుకు నోటు కేసుపై సమీక్ష జరిపిన మర్నాడు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పనిలో పనిగా ఆయన కాంగ్రెసుపై కూడా విమర్శలు చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వాగ్బాణాలు వదిలారు.

ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎదురు తిరిగాయి. రేవంత్ రెడ్డిపై కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఏ విధమైన హామీలు కూడా ఇవ్వలేదని సుధాకర్ రెడ్డి చెప్పారు.

దాంతో రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడినట్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు అనుకూలంగా వ్యవహరిస్తుందనే కారణంతో ఆ పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరారు. ఇక్కడ కూడా ఆయనకు పరిస్థితులు కలిసిరావడం లేదు. పైగా, ముఖ్యమంత్రి కావాలనే ఆయన ఆశలు సమీపంలో కనిపించడం లేదు. 

కాంగ్రెసులో డజను మంది దాకా ముఖ్యమంత్రి పదవికి అర్హులైనవారున్నారు. పైగా కాంగ్రెసులో ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎవరు పైకి వస్తారో, ఎప్పుడు ఎవర పరిస్థితి దిగజారుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. అందువల్ల  కేసీఆర్ పై యుద్ధం ప్రకటించిన కోదండరామ్ తో కలిసి నడిచేందుకు ఆయన సిద్ధపడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

click me!