రాష్ట్రప్రభుత్వం గృహలక్ష్మీ పథకాల దరఖాస్తుల పరిశీలనకు బ్రేకులు వేసినట్టు తెలిసింది. ఈ పథకానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ను చేపట్టనుంది. గ్రామ సభల్లో ఈ స్కీమ్ లబ్దిదారులను ఎంపిక చేయాలనే ఆలోచనలు చేస్తున్నది.
Telangana News: గత ప్రభుత్వ హయాం చివరలో గృహ లక్ష్మీ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు అందరూ క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ల కోసం మీ సేవల్లో నిండిపోయారు. ఆ తర్వాత గృహలక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికీ మీ సేవల ముందు పడిగాపులు గాశారు. ఎట్టకేలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ దరఖాస్తులను పరిశీలించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారులను ఎంచుకుంటామని ఓ మంత్రి ఇటీవలే తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల కోసం డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ధరలు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. పీఎం ఆవాస్ యోజనా నిధులనూ కొన్ని సాంకేతిక కారణాలతో కేంద్రం నిలిపేసింది. ఈ సందర్భంలో గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం స్థానంలో గృహలక్ష్మీ పథకాన్ని ప్రకటించింది. సొంత భూమి ఉన్న నిరాశ్రయులకు ఈ పథకం కింద గృహ నిర్మాణం చేసుకోవడానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆ ప్రభుత్వం తెలిపింది.
కానీ, దరఖాస్తుల స్వీకరణ, లబ్దిదారుల ఎంపిక, నిధుల పంపిణీ వరకూ ప్రక్రియ జరుగుతుండగా ఎన్నికలు సమీపించాయి. దీంతో ఆ పథకంపై ఫోకస్ తగ్గిపోయింది. ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారింది.
Also Read: Mahalakshmi: ఆటో డ్రైవర్ల మొర ఆలకంచిన సర్కారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకానికి బదులు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టనుంది. సాధారణంగా ఇందిరమ్మ ఇళ్లను గ్రామ సభలలోనే లబ్దిదారులను ఎంచుకుని ఆర్థిక సహాయం ప్రకటించేది. ఈ సారి కూడా గ్రామ సభల్లోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అందుకే.. గతంలో గృహలక్ష్మీ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి సహాయం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడానికి బ్రేకులు వేసినట్టు సమాచారం.