గులాబీ అధినేతకు రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్

By Rajesh Karampoori  |  First Published Oct 25, 2023, 5:09 AM IST

తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ ఆ సవాల్ ఏంటీ?  
 


తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలన్నీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ తరుణంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఆ పార్టీల మధ్య నిత్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడి ఈ సవాల్ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతోంది. ఇంతకీ ఏం సవాల్ విసిరారంటే..?  

రేవంత్ రెడ్డి మంగళవారం నాడు కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్య కర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... దమ్ముంటే గులాబీ అధినేత కేసీఆర్‌ .. కొడంగల్ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. 

Latest Videos

తానూ నామినేషన్ వేస్తానని, ఎవరు రాజకీయాల్లో ఉండాలో, ఎవరు రాజకీయాలు వదిలేయాలో డిసైడ్ అవుతుందని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్ని హామీలను నెరవేర్చారో చెప్పాలని నిలదీశారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా? సమస్యలు అన్ని పరిష్కరించారా? ప్రశ్నించారు.పేదోడికి డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగులకు భృతి ఇచ్చారా అని నిలదీశాడు. 

కొడంగల్ ను దత్తత తీసుకుని ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని చెప్పి తండ్రీకొడుకులు జనాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తీసుకొచ్చిన నారాయణపేట- కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కట్టకుండా.. అటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తి చేయకుండా కొడంగల్ ను ఎడారిగా మార్చుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ విధి విధానాలతో తెలంగాణ ప్రజల్లో అసహనం పెరుగుతోందని అన్నారు. అందుకే ఈ సారి అధికార మార్పిడి జరిగే అవకాశముందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన సమయం వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

click me!