
రాజకీయ దురుద్దేశాలతో అశాస్త్రీయంగా జిల్లాలను, మండలాలను విభజించి సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేంవత్ రెడ్డి .. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం నియోజకవర్గాల డిలిమిటేషన్ జరగక ముందే జిల్లాలను విభజించారన్నారు. ప్రస్తుతం డిలిమిటేషన్ కోసం కేంద్రం పై ఒత్తడి తీసుకురావడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే 2004 నాటికి ఉనికిలో ఉన్న జిల్లాలు, మండలాల ప్రాతిపదికనే నియోజకవర్గాల డిలిమిటేషన్ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లాల విభజన, దాని వెనకఉన్న రాజకీయ దురుద్దేశాల గురించి రేవంత రెడ్డి.. రాష్ట్రపతితో పాటు, ప్రధాని, కేంద్ర న్యాయశాఖ, హోం శాఖ మంత్రులకు, జాతీయ ఎన్నికల కమిషన్ కు సోమవారం విడివిడిగా రాసిన లేఖల్లో ఫిర్యాదు చేశారు. నవంబర్ 16 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అపాయింట్ మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం డిలిమిటేషన్ జరిగిన తర్వాతే జిల్లాల, మండలాల విభజన జరగాలని కానీ, దానికి విరుద్ధంగా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం ముందే విభజన చేశారని ఆరోపించారు. పునర్ విభజన చట్టం ప్రకారం 2004 ఫిబ్రవరి 15 నాటికి వాటి పరిధిలు ఎలా ఉంటే అలాగే ఉంచాలని గుర్తు చేశారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కొత్త నియోజకవర్గాలు ఉండాలనే దురుద్దేశంతోనే సీఎం కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా జిల్లాలను, మండలాలను విభజించారని ఆరోపించారు. ఇలా జిల్లాలను అశాస్త్రీయంగా విభజించడం వల్ల రాష్ట్రపతి పర్యవేక్షణలో ఉండే జోనల్ వ్యవస్థ కూడా దెబ్బతిందని ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు.