ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు రాజ్ భవన్ లో నిర్వహించనున్నారు. గత ఏడాది కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలను రాజ్ భవన్ లోనే నిర్వహించారు.
హైదరాబాద్: ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరగలేదు. అయితే గణతంత్ర వేడుకలకు సంబంధించి రాజ్ భవన్ లోనే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన రాజ్ భవన్ లో ఉదయం జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరిస్తారు. సాయంత్రం పూట రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత ఏడాది కూడ రాజ్ భవన్ లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గణతంత్ర వేడుకలకు గత ఏడాది కేసీఆర్ దూరంగా ఉన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ కొనసాగుతుంది. ఈ గ్యాప్ గణతంత్ర దినోత్సవ వేడుకలపై పడింది. గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాకుండా గవర్నర్ స్వంతంగా ఉపన్యాసం చేయడం అధికార పార్టీకి కోపం తెప్పించిందనే ప్రచారం కూడా లేకపోలేదు.
దీంతో రిపబ్లిక్ వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే ప్రచారం కూడా లేకపోలేదు. రిపబ్లిక్ డే వేడుకల గురించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఇటీవలనే రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే సందర్భంగా సాయంత్రం పూట ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఎట్ హోం కార్యక్రమానికి కొంత కాలంగా కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. మరో వైపు ఈ ఏడాది జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి.