గవర్నర్‌ వర్సెస్ సీఎం.. ఈ ఏడాది కూడా రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుక.. కేసీఆర్ హాజరయ్యేనా..?

By Sumanth KanukulaFirst Published Jan 24, 2023, 11:51 AM IST
Highlights

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో గతేడాది మాదిరిగానే.. ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకుల రాజభవన్‌కే పరిమితం కానున్నాయి.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో గతేడాది మాదిరిగానే.. ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకుల రాజభవన్‌కే పరిమితం కానున్నాయి. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తుంటాయి. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వేడుకల్లో గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొంటుంటారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌ జాతీయ  జెండాను ఎగరవేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తెలంగాణలో  రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య నెలకొన్న విభేదాలు గణతంత్ర దినోత్సవ వేడుకలపై పడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. 

తెలంగాణలో కరోనాకు ముందు పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలను ఘనంగా  నిర్వహించారు. 2019లో తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ బాధ్యతలు చేపట్టగా.. 2020లో పబ్లిక్ గార్డెన్స్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా చేపట్టింది. 2021లో కూడా పబ్లిక్ గార్డెన్స్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించినా.. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఈ రెండు సందర్భాల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఆ తర్వాత గవర్నర్‌కు, సీఎంకు మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంతో  గవర్నర్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడంతో విభేదాలు ముదిరాయి. 

ఈ క్రమంలోనే 2022 జనవరి 26న గణతంత్ర దినోత్సవం రాజ్‌భవన్‌కే పరిమితమైంది. కరోనా కారణంగా పబ్లిక్‌ గార్డెన్‌లో ఉత్సవం నిర్వహించే పరిస్థితి లేదని, రాజ్‌భవన్‌లోనే నిర్వహించుకోవాలని సూచించింది. ఆ వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు, మంత్రులు కూడా దూరంగా ఉన్నారు. దీంతో రాజ్‌భవన్‌లోనే జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై.. తన సొంత ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఇక,  ఆ తర్వాత కూడా ఈ విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ పలు సందర్భాల్లో గవర్నర్‌ కామెంట్స్ చేశారు. మరోవైపు మంత్రులు, ప్రభుత్వ వర్గాలు కూడా గవర్నర్‌ తీరును తప్పుబట్టాయి.

ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే గణతంత్ర దినోత్సవం ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించడం లేదని సమాచారం. మరోవైపు రిపబ్లిక్ డే ఈవెంట్‌ను స్వతంత్రంగా నిర్వహించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు తెలియజేసిందని సమాచారం. సీఎం కేసీఆర్ కూడా గతేడాది మాదిరిగానే రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశం ఉండదని  సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆ రోజు ఆయన ప్రగతిభవన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. 

సాధారణంగా.. గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ బహిరంగ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత చేసే  ప్రసంగంకు సంబంధించిన కాపీని రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంటుంది. అయితే ఈ సారి ప్రసంగ కాపీని పంపేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని సమాచారం. గవర్నర్ ప్రసంగం కాపీని కోరుతూ రాజ్‌భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని.. దానిపై ఎటువంటి స్పందన లేదని సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

click me!