తెలంగాణలో ప్రజలకు కేసీఆర్ ఏం చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు.
మహబూబ్ నగర్: రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంగళవారంనాడు మహబూబ్ నగర్ లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఆయన ప్రసంగించారు.గవర్నర్ ప్రసంగం లేకుుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెట్టారో అర్ధం కావడం లేదని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై అప్పుల భారం మోపడం మినహ ప్రజలకు కేసీఆర్ ఏం చేశాడని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఏ దేశం గురించి మాట్లాడితే ఆ దేశం దివాళా తీస్తుందన్నారు. నోరు తెరిస్తే కేసీఆర్ చైనా గురించి మాట్లాడుతాడన్నారు. కానీ కరోనాతో చైనా దివాళా తీసిందని బండి సంజయ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పాకిస్తాన్, శ్రీలంకల కంటే మన దేశం పరిస్థితి దారుణంగా ఉందని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ గుర్తు చేశారు. పాకిస్తాన్ లో తిండి లేక జనం అల్లాడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. శ్రీలంకలో ఏ రకమైన పరిస్థితులున్నయో కూడా చూశామన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఏం చేశాడని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిపై కేసీఆర్ అప్పులను మోపాడని బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణ ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కలెక్టర్, పోలీస్ వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసిందని ఆయన విమర్శించారు. 317 జీవో సవరించకుంటే ధర్నాచౌక్ వద్ద భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. స్వంత ఎజెండా కోసం పనిచేసేవారు బీజేపీ నాయకులే కాదన్నారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. తెలంగాణలో అన్నివర్గాలను అణచివేస్తున్నారని ఆయన తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.