
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది, కానీ తాను పార్టీ మారే ఆలోచన తనకు లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకొంటారని ఆమె ప్రశ్నించారు. పరోక్షంగా ఆమె మల్లు భట్టి విక్రమార్కపై విమర్శలు చేశారు.
గురువారం నాడు హైద్రాబాద్‌లోని తన నివాసంలో రేణుకా చౌదరి కార్యకర్తలతో సమావేశమైంది. ఈ సమావేశంలో ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పదవులు వచ్చినంత మాత్రాన కిరిటాలు రావని ఆమె కొందరు నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ఎవరు బాధ్యత తీసుకొంటారో చెప్పాలన్నారు.
తాను కొందరిని ఓడించేందుకు ప్రయత్నం చేసినట్టుగా ముగ్గురు తనపై ఫిర్యాదు చేసినట్టు ఆమె ప్రస్తావించారు. తాను ఓడించాలని చూస్తే వాళ్లు ఎలా గెలిచారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పిందేమిటీ, ఇక్కడ ఏం జరుగుతోందని ఆమె ప్రశ్నించారు.కాబోయే సీఎం, మంత్రిని అంటూ గొప్పలు చెప్పుకొంటున్నారని ఆమె కొందరు నేతలపై ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి అన్ని విషయాలు తెలియడం లేదన్నారు.
సంబంధిత వార్తలు
రాజీనామా చేస్తా: అధిష్టానానికి రేణుకా చౌదరి వార్నింగ్