మునుగోడులో రికార్డు స్థాయిలో ఓటింగ్‌.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 93 శాతం..

By SumaBala BukkaFirst Published Nov 4, 2022, 9:33 AM IST
Highlights

తెలంగాణలో గురువారం జరిగిన ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో అత్యధిక ఓటింగ్ నమోదయ్యింది. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో 93శాతం ఓటింగ్ తో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా నిలిచింది.

హైదరాబాద్‌ : రాష్ట్రంతోపాటు దేశంలోనూ ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ గురువారం ముగిసింది. ఊహించినట్లుగానే రికార్డు స్థాయిలో 93 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,24,878 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్‌ శాతం కావడం గమనార్హం. 2018 సాధారణ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో నమోదైన 91.27 శాతమే ఇప్పటిదాకా అత్యధికంగా ఉంది. అప్పుడు కూడా 91.07 శాతంతో మునుగోడు ఆ తరువాతి స్థానంలో నిలిచింది. తాజాగా ఉప ఎన్నికలో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. 

బుధవారం అర్ధరాత్రి వరకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, చోటుచేసుకున్న ఘటనలతో పోలింగ్‌ రోజు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన నెలకొన్నా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు, నాయకులు ఆందోళనకు దిగడం వంటివి తలెత్తగా.. అధికారులు, పోలీసులు వీటిని చక్కదిద్దారు. కొన్ని చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 

ఫాం హౌజ్ ఆడియో, వీడియోల విడుదలను ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన నిందితుడి భార్య..

కాగా, పలువురు ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ పార్టీల నాయకులను బహిరంగంగానే నిలదీయడం గమనార్హం. పెద్ద పెద్ద లీడర్లకు రూ.లక్షలు ముట్టజెప్పారని, తమకు మాత్రం ఏమీ ఇవ్వలేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మర్రిగూడ మండలం శివన్నగూడంలో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని పలువురు ఓటర్లు అడ్డుకొని తమకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మరోవైపు మునుగోడు మండల కేంద్రంలో కొందరు ఓటర్లు తమకు డబ్బులు అందలేదంటూ బీజేపీ నేతల ఇళ్లకు వెళ్లి మరీ నిలదీశారు.

click me!