వార్నీ.. ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుని ఒకరి మృతి..

By SumaBala BukkaFirst Published Nov 4, 2022, 9:05 AM IST
Highlights

మద్యం తాగుతూ మంచింగ్ కోసం తిన్న ఆమ్లెట్ అతడి ప్రాణాలు తీసింది. గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక అక్కడికక్కడే మృత చెందాడు. 

జనగామ : మద్యం తాగుతున్న వ్యక్తి గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుపోవడంతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ దారుణం గురువారం చోటు చేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్ రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని పర్మిట్ రూంలో కూర్చుని మద్యం తాగుతున్నాడు. మద్యంలోకి మంచింగ్ గా ఆమ్లెట్ ఆర్డర్ చేశాడు. అతి తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోయాడు. ఇది గమనించిన దుకాణదారులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు జూన్ లో అస్సాంలో ఇలాంటి ఘటనే చోటు చేసకుంది. లిచీ పండు గింజ గొంతులో ఇరుక్కుని 16యేళ్ల బాలిక మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోర్హాట్ జిల్లా, కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10వ తరగతి చదువుతోంది. 

కానిస్టేబుల్ గా పనిచేసే బాలిక తండ్రి ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు లిచీ పళ్లను తీసుకొచ్చారు. వాటిని తిన్న బాలిక కొంత సేపటికే నేల కూలింది. ఏమైందో అర్థం కాని తల్లిదండ్రులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. 

సుమారు రెండు అంగుళాల పొడవు ఉండే లిచీ పండు విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఆ అమ్మాయి మరణించిందని వారు స్పష్టం తెలిపారు. కూతురి మీద ప్రేమతో తెచ్చిన పండ్లు ఆమె ప్రాణాలు తీయడం, ఆకస్మిక మరణం తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

ఫాం హౌజ్ ఆడియో, వీడియోల విడుదలను ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన నిందితుడి భార్య..

ఇక, 2019లో తమిళనాడులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పరోటా గొంతులో ఇరుక్కుని నవవరుడు మృతిచెందాడు. పుదుచ్చేరి కరువడి కుప్పం భారతీనగర్‌కు చెందిన పురుషోత్తమన్ తిరుమాంబాక్కంలోని కార్లషోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండేవాడు. ఇతనికి షణ్ముగ సుందరి అనే యువతితో చనిపోయే ఆరు నెలల క్రితం వివాహమైంది. షణ్ముగ సుందరి కొద్దిరోజుల క్రితం తిరునెల్వేలిలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పురుషోత్తమన్ రాత్రి భోజనానికి పరోటా కొనుక్కుని వచ్చి తింటున్నాడు.

అదే సమయంలో భార్య ఫోన్ చేసింది. ఆమెతో మాట్లాడుతూ పరోటా తింటున్నాడు. ఇంతలో ఏమయ్యిందో కానీ చిన్న పరోటా ముక్క గొంతులో చిక్కుకుపోయింది. దీంతో మాట్లాడడానికి వీలు కాలేదు. ఎంతసేపటికి భర్త ఏమీ మాట్లాడకపోవడంతో షణ్ముగ సుందరి ముత్యాలపేటలోని బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే భారతీనగర్‌లోని పురుషోత్తమన్ ఇంటికి వెళ్లారు. తలుపులు గడియపెట్టి వుండటంతో ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. 

అక్కడ స్పృహతప్పి ఉన్న పురుషోత్తమన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. పరోటా గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక పురుషోత్తమన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

click me!