
కరీంనగర్ జిల్లాచొప్పదండిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపుతోంది. అయితే సూసైడ్ నోట్‌లో తన చావుకు ఇంటెలిజెన్స్ సీఐ గోపికృష్ణ వేధింపులే కారణమని పేర్కొన్నారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. చొప్పదండి మండలంలోని భూపాలపట్నంలో బొడిగ శ్యామ్ అలియాస్ శంబయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ సీఐ గోపి కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా.. గోపికృష్ణకు భూపాలపట్నంలో కొంత భూమి ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శంబయ్య ఆ భూమిని అమ్మిపెడతానని గోపికృష్ణతో చెప్పాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే డబ్బుల గురించి సీఐ గోపికృష్ణ వేధింపులు నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన్టుగా శంబయ్య పేర్కొన్నాడు.
మరోవైపు శంబయ్య కుటుంబ సభ్యులు కూడా ఆయన మృతికి గోపికృష్ణ వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. సీఐ గోపికృష్ణ నుంచి తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని చెబుతున్నారు. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.