పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో అరెస్టైన బండి సంజయ్ తన మీద కఠిన చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్ : హిందీ పేపర్ లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కమలాపూర్ స్కూల్ హెడ్మాస్టర్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బండిసంజయ్ న్యాయస్థానాన్ని కోరారు. కానీ దీనికి కోర్టు నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.
శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జలు భూయాన్ 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసు దర్యాప్తుపై స్టే విధించాలని వేసిన పిటిషన్ పై విచారణ చేశారు. సంజయ్ పై ఎలాంటి బలవంతపు చర్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది ఎల్ రవిచంద్ర వాదించారు. పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రంలోకి ఎవరు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయుడిదని.. అతను ఆ పని సరిగా చేయకుండా బండి సంజయ్ మీద ఫిర్యాదు చేయడం మీద ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు.
బండి సంజయ్ కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా 41 ఏ సి ఆర్ పిసి కింద అరెస్టు చేశారని అన్నారు. ఇలా చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని తెలిపారు. దీని మీద ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. బండి సంజయ్ మిగతా నిందితులతో కలిసి ఈ కేసులో కుట్రపన్నారని అన్నారు. బండి సంజయ్ అరెస్టు తర్వాత ఇంకే ప్రశ్నాపత్రాలు లీకేజీ కాలేదని గుర్తు చేశారు. ప్రశ్నా పత్రాల లీకేజీలను ప్రోత్సహించడం, వాటికి ప్రేరేపించడం రాష్ట్రంలో చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని అన్నారు.