బీరువాలో దాచిన రూ. 4 లక్షల నగదును ఎలుకలు కొరికాయి. ఆపరేషన్ కోసం రెడ్యా అనే వృద్దుడు ఈ 4 లక్షలను బీరువాలో దాచాడు ఈ డబ్బులు పోగొట్టుకొన్న వృద్దుడికి సహాయం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హమీ ఇచ్చారు.
హైదరాబాద్: ఆపరేషన్ కోసం దాచుకొన్న డబ్బులు ఎలుకలు కొరకడంతో ఓ వృద్ధుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ విషయం తెలిసిన మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. బాధితుడికి వైద్య సహాయంతో పాటు అవసరమైన నగదు అందిస్తామని హామీ ఇచ్చారు.మహబూబాబాద్ జిల్లా వేంసూరు శివారు ఇందిరానగర్ కాలనీ తండాకు చెందిన భూక్యా రెడ్యా కడుపులో కణితి ఏర్పడింది. దీంతో ఆయనకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ కోసం రూ. 4 లక్షలు ఖర్చు అవుతోందని వైద్యులు చెప్పారు.
రెడ్యా కూరగాయల వ్యాపారం చేయడంతో రూ. 2 లక్షలు కూడబెట్టాడు. మరో రూ. 2 లక్షలను అప్పుగా తీసుకొన్నాడు. ఈ మొత్తం నగదును బీరువాలో భద్రపర్చాడు. ఆసుపత్రికి వెళ్లేందుకు మంగళవారం నాడు బీరువా తెరిచి డబ్బులను చూశాడు. అయితే బీరువాలో పెట్టిన డబ్బులను ఎలుకలు కొరికాయి.ఎలుకలు కొరికిన డబ్బులను బ్యాంకుల్లో మార్పిడి చేసుకొనేందుకు ఆయన ప్రయత్నించారు.
కానీ బ్యాంకు సిబ్బంది ఈ డబ్బులను తీసుకొనేందుకు నిరాకరించారు. రిజర్వ్ బ్యాంకులో సంప్రదించాలని బ్యాంకు సిబ్బంది కొందరు ఆయనకు సలహా ఇచ్చారు. ఆపరేషన్ కు డబ్బులు లేకపోవడం, అప్పు కూడ చెల్లించలేని స్థితి నెలకొనడంతో రెడ్యా విలపించాడు. ఈ విషయం తెలిసిన మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. రెడ్యాకు ఆపరేషన్ చేయించడంతో పాటు నగదును కూడ అందిస్తామని హామీ ఇచ్చారు.