2018లోనే నా ఓటమికి కుట్ర.. ఇప్పుడన్నది ఆనాటి కేసీఆర్ కాదు: ఈటల సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 18, 2021, 4:28 PM IST
Highlights

ఒకప్పుడు కేసీఆర్ ఉద్యమాన్ని నమ్ముకున్నారని.. ఇప్పుడు డబ్బు, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నారంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్. నిజాం సర్కార్‌ను తలపించేలా హుజురాబాద్‌లో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు

రేపు గోపాలపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటల రాజేందర్. ఆదివారం హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబలలో పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటల విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు కేసీఆర్ ఉద్యమాన్ని నమ్ముకున్నారని.. ఇప్పుడు డబ్బు, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నారంటూ వ్యాఖ్యానించారు. నిజాం సర్కార్‌ను తలపించేలా హుజురాబాద్‌లో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించే సంస్కృతి కేసీఆర్ ప్రభుత్వంలో లేదని ఈటల దుయ్యబట్టారు. తనను ఓడించడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారని.. 2018లోనే తనను  ఓడించడానికి కుట్ర జరిగిందని రాజేందర్ ఆరోపించారు. 

Also Read:హుజురాబాద్ ఉపఎన్నిక మరింత రసవత్తరం... పోటీలో ఈటల సతీమణి జమున?

అంతకుముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. ఈటల ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణ చేస్తున్నందుకు బీజెపీలో కలిశారా అని ఈటల రాజేందర్‌ను నిలదీయాలని ఆయన ప్రజలకు సూచించారు. త్వరలో రాష్ట్రం లో అరవై వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఖాళీ ఉన్న ఉద్యోగుల భర్తీ చేస్తామని గంగుల తెలిపారు. ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని కమలాకర్ ఆరోపించారు. టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని.. ఈటల గెలిస్తే రాష్ట్రంలో బిజెపికీ ఒక ఎంఎల్ఏ పెరుగుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు

click me!