దామరచర్ల గురుకులంలో మరో ఘటన... విద్యార్థినులను కొరికిన ఎలుకలు..

Published : Apr 19, 2022, 09:01 AM IST
దామరచర్ల గురుకులంలో మరో ఘటన... విద్యార్థినులను కొరికిన ఎలుకలు..

సారాంశం

నల్గొండ దామరచర్ల గిరిజన పాఠశాల బాలికల గురుకుల వసతి గృహంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులను ఎలుకలు కరిచాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

నల్గొండ :  నల్గొండ జిల్లా దామరచర్ల గిరిజన పాఠశాల బాలికల గురుకుల వసతి గృహంలోని ఇద్దరు బాలికలు తమను ఎలుకలు కరిచాయంటూ సోమవారం స్థానిక పీహెచ్సీకి రావడంతో ఆందోళన రేగింది. ఇదే గురుకులానికి చెందిన 50 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం కారణంగా శనివారం అస్వస్థతకు గురైన క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఎలుక కరిచిన బాలికలకు టిటి ఇంజక్షన్లు ఇచ్చినట్లు వైద్యాధికారి పేర్కొన్నారు. వరుస ఘటనలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

అపరిశుభ్ర వాతావరణం, కనీస జాగ్రత్తలు కొరవడడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థులు పాము, కాటుకు గురవుతున్నారు. వంటగది శుభ్రతను విస్మరించడం, కుళ్లిన ఆహార పదార్థాలు, కూరగాయలను వంటకు ఉపయోగిస్తుండడంతో తరచూ ఎక్కడో ఒకచోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తే అధికారుల నిర్లక్ష్యం వారి ప్రాణాల మీదకు తెస్తుంది. నల్గొండ జిల్లా దామరచర్లలోని  గురుకులంలో కలుషితాహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన మరువక ముందే, ఆరుగురిని ఎలుకలు కొరికిన విషయం బయటపడింది.  

పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో భాగంగా సోమవారం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ పరీక్షించడానికి రాగా.. ఆదివారం రాత్రి తమ కాళ్ళు, చేతులను కొరికాయని పదోతరగతి విద్యార్థినిలు రజిత, శ్రావణి చెప్పారు. 3 రోజుల క్రితం తమను కూడా ఎలుకలు కరిచాయని మరో నలుగురు విద్యార్థినులు తెలిపారు. వీరందరికీ పాఠశాలలో చికిత్స చేశారు. కాగా, స్టోర్ రూమ్ నిర్వహణ కొరవడడం,  చుట్టుపక్కల చెట్లు ఉండటంతో  గదుల్లోకి ఎలుకలు వస్తున్నట్లు  తెలుస్తోంది. గురుకులంలో 450 మంది విద్యార్థినులు ఉన్నారు.  ప్రిన్సిపల్ క్వార్టర్స్ లోనే ఉంటూ విధులు నిర్వహిస్తారు.

కనిపించని పరిశుభ్రత
వాస్తవానికి  కరోనా వ్యాప్తి తర్వాత  పరిశుభ్రత, ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది.  పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే నిబంధన ఉన్నా చాలా గురుకులాల్లో మచ్చుకైనా కనిపించని పరిస్థితి. కొన్నిచోట్ల సరైన వసతి సదుపాయాలు లేకపోవడంతో ఈ గదిలోనే విద్యార్థులు రాత్రి పూట  నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది.

ఆహారం రుచి చూడకుండానే..
గురుకులాల్లో పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఈనెల 16న నల్గొండ జిల్లా దామరచర్లలోని గురుకులంలో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో తనిఖీలు జరిపిన అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలను వంటకు ఉపయోగిస్తున్నట్లు గమనించారు. ఈ పాఠశాలకు రోజు మిర్యాలగూడ నుంచి తెచ్చిన కూరగాయలను వంటగదిలో నిల్వచేస్తారు. అవి వాడిపోయినా వంటకు వినియోగిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేని విషయాన్ని విద్యార్థినుల తల్లిదండ్రులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 

అయితే, దామరచర్లలోని  గురుకులంలో  విద్యార్ధినులపై ఎలుకలు దాడిచేసిన ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందారు. గతంలో పాములు కూడా వచ్చాయని, అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!