కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందాా...! కాంగ్రెస్ లోకి వలసలు... రేవంత్ తో మరో కీలక నేత భేటీ

By Arun Kumar P  |  First Published Oct 5, 2023, 1:19 PM IST

అందరకంటే ముందే అభ్యర్ధులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. 


హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సందడి మొదలయ్యింది. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇలా చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది కేసీఆర్ వ్యూహం. కానీ ఇది కాస్త బెడిసికొట్టినట్లుగా కనిపిస్తోంది. బిఆర్ఎస్ టికెట్ దక్కక అసంతృప్తితో కొందరు కీలక నాయకులు పార్టీని వీడుతుండటం పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. ఇలా ఇప్పటికే మాజీ మంత్రులు, సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పదవుల్లో కొనసాగుతున్నవారు, కీలక నాయకులు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతరపార్టీల్లో చేరారు. తాజాగా ఇదేబాటలో నడిచేందుకు సిద్దమయ్యారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి ఛైర్మన్ మనోహర్ రెడ్డి. 

బిఆర్ఎస్, బిజెపి నుండి వలసలు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మంచి జోరుమీదవుంది. రోజురోజుకు ఆ పార్టీలో చేరే నాయకులు సంఖ్య పెరుగుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించి వారితో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇలా బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ  ఉమ్మడి రంగారెడ్డి డిసిసిబి ఛైర్మన్ తో కూడా కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరిపారు. ఇవి ఫలించడంతో మనోహర్ రెడ్డి  బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమయ్యారు. 

Latest Videos

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ లతో తన నివాసంలోనే మనోహర్ రెడ్డి భేటీ అయ్యారు. తాండూరు టికెట్ ఆశిస్తున్న ఆయనకు రేవంత్ నుండి హామీ లభించడంతో త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. తన సన్నిహితులు, అనుచరులతో మరోసారి చర్చించి కాంగ్రెస్ లో చేరికపై మనోహర్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Read More  కెసిఆర్ లో అన్ని బాగున్నాయి!! అవి తప్ప??

ఇదిలావుంటే ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి కీలక నాయకుడు సైతం బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అలాగే మల్కాజ్ గిరి టికెట్ దక్కినప్పటికి కొడుకుకు మెదక్ టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు కూడా బిఆర్ఎస్ ను వీడారు. అలాగే మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా వరుసగా కీలక నాయకులు రాజీనామా  చేయడం బిఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బే.  

మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతుండటం... మరికొందరు అసంతృప్తులు ఇదే ఆలోచనతో వుండటం అధికార బిఆర్ఎస్ ను కలవరపెడుతోంది. బిఆర్ఎస్ నుండే కాదు బిజెపి నుండి కూడా నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ చేరికలతో కాంగ్రెస్ జోరు పెరిగితే బిఆర్ఎస్, బిజెపి ఢీలా పడుతున్నాయి.  

click me!