Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ లో అన్ని బాగున్నాయి!! అవి తప్ప??

ఇప్పటివరకు రైతుబంధు పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. ఇదీ ఆ వార్త! ఆ 73 వేల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మిరాకిల్స్ చేశాయి... రాష్ట్ర భూముల ధరలు పెంచాయి.

Harikanth on Telangana CM KCR working style kpr
Author
First Published Oct 5, 2023, 10:16 AM IST | Last Updated Oct 5, 2023, 10:42 AM IST

నేను రాసేది కొందరికి రుచించకపోవచ్చు... చేదెప్పుడు రుచించదు కూడా. తిన్నింటిపై బండలు, అభాండాలు వేస్తున్నావని అనవచ్చు! కానీ నేనింతకుముందే చెప్పినట్టుగా రాజకీయం చాలా విచిత్రాతివిచిత్రమైంది. రాజకీయమంటే యధార్థం, ఆ యధార్థాన్ని అనుభవించి ఆస్వాదించి ఆపోసనం పట్టిన నాయకులకే రాజకీయం రసకందాయం అవుతుంది. పుట్టుక ప్రకృతి.. చావు విధి.. మధ్యలో జీవితం.. ఇది వేదాంతం! నాయకుడు పుడతాడు.. పోతాడు.. మధ్యలో లిఖించేదే చరిత్ర.. ఇది రాజకీయ సిద్ధాంతం!! మహామహానాయకులే కొన్ని రాజకీయ వ్యూహాత్మక తప్పిదాలతో మట్టికరచిన సందర్భాలున్నాయి. చరిత్ర కాలగర్భంలో చెరచబడ్డ  ఘటనలు సైతం ఉన్నాయి. మన దేశంలో కొందరు అరుదైన నాయకులు కొన్ని వ్యామోహాలను (వ్యసనాలను కాదు) పక్కన పెట్టి చరిత్రలో నిలిచిపోవాలని తహతహలాడతారు. రాజుల కాలం నుండి ఇది ఉంది. అందుకే చరిత్ర పుటలకెక్కిన మహారాజుల రాజనీతిజ్ఞత ప్రజారంజకంగా ఉండేలా తాపత్రయపడేవారు. అందుకే అప్పుడప్పుడు తమ పరిపాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారని ముసుగువేషాల్లో ప్రజల మధ్యకు వెళ్లేవారు. ప్రజలు మహారాజులను తమ వాడిగా, తమింట్లో మనిషిగా భావించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ పై ఫ్యాక్షనిస్ట్ అని, అవినీతిపరుడని రకరకాల ఆరోపణలున్నప్పటికీ ప్రజలతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. ఉదయం నాలుగింటికే తన ఇంటి ముందు అధికారులు, ప్రజలతో కూడిన పెద్ద క్యూ లైన్ ఉండేది. వారందరిని ఒక్కొక్కరిని కలుస్తూ పేరుపేరునా పలకరించి వారి సాధకబాధలు వినేవాడు. ఆయనపై ఎన్ని ఆరోపణలున్నా, మరెన్నో అనుమానాలున్నా ప్రజలు తమ మనిషిగా, తమ వాడిగా భావించారు.. ఎందుకు?? 

ఒక పత్రికలో వార్త: ఇప్పటివరకు రైతుబంధు పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. ఇదీ ఆ వార్త! ఆ 73 వేల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మిరాకిల్స్ చేశాయి... రాష్ట్ర భూముల ధరలు పెంచాయి. రాష్ట్ర ప్రజలకు వ్యవసాయం మీద ప్రేమను పెంచాయి. సరే ఇది వేరే విభిన్నమైన విషయం!!

మరిప్పుడు అప్పటి మహారాజులకన్నా, కేవలం ఒకానొక వర్గంతో మహానేతగా చేయబడ్డ వైఎస్సార్ కన్నా ఎన్నో రెట్లు తెలంగాణ రాష్ట్రానికి మంచి చేసిన (ఎవరు ఔనన్నా కాదన్నా కొన్ని నిజాలున్నాయి) కెసిఆర్ ను ప్రజలు ఓన్ చేసుకోవటం లేదెందుకు? 
ఎందుకు??

 

ఆ మహారాజుల్లో కనిపించే "మానవతావాదం" కెసిఆర్ లో లేదు కాబట్టి... అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ లో కనిపించిన "కనెక్టివిటీ" ఇప్పటి కెసిఆర్ లో కనబడటం లేదు కాబట్టి... సరే రాజకీయంగా కెసిఆర్ కు ఎన్నైనా కారణాలుండవచ్చు, కానీ ప్రజలతో కనెక్టివిటీ అనే "అనుబంధాన్ని" కోల్పోబడుతున్నాడు. ప్రజల మనసును హత్తుకునే "మానవతావాదాన్ని" చూపించలేకపోతున్నాడు. ప్రజలకు ధనమిచ్చినా, ధాన్యపురాశుల బాండాగారాలిచ్చినా, నిలువ నీడనిచ్చినా, నడెండల్లో నీళ్లిచ్చినా, అద్దాల మేడలు కట్టినా, అబ్బురపరిచే అద్భుత ప్రగతి సోపానాలు చూపినా..., ప్రజలకు కావాల్సిన ఎన్నో కనీసావసరాలు తీర్చినా వారింకా ఏదో శూన్యతలో, అసహనంలో ఉంటూనే ఉంటారు. ఆ శూన్యతే నాయకునికి, ప్రజలకు మధ్య ఉండే మానవతావాదం, అనుబంధం.  ప్రజలు తమకు ఏమిచ్చినా ఏమివ్వకపోయినా తమ నాయకుడు తమ మనసుకు దగ్గరగా ఉండాలనుకుంటారు. అలా ఉంటేనే ఆ నాయకుడు తమతోనే ఉన్నట్టుగా భావిస్తారు... ఉద్రేకపూరితమైన బంధంతో చేరువవుతారు... ఇవ్వన్నీ కాలానుగమనంలో ప్రజాకోణం నుండి విశ్లేషింపబడిన చరిత్ర మిగిల్చిన అవశేషాల ద్వారా వెలికితీయబడ్డ వాస్తవికత పార్శ్వాలు.

కెసిఆర్ చేస్తున్న ఈ రెండింటి రాజకీయ తప్పిదాలతో కూడిన ఇంకో తప్పిదం మరొకటి ఉంది విమర్శనాత్మక కోణాన్ని సకారాత్మకకోణంలో స్వీకరించలేకపోవటం. నెగెటివ్ అనే విషయాన్నీ తన దరిదాపుల్లోకి కూడా రానీయకపోవటం. 

పైన పేర్కొన్న మూడు అంశాలు పాటించని ఏ పాలకుడు కూడా చరిత్ర పుటల్లోకెక్కినట్టు లిఖించబడలేదు. లిఖించబడడు కూడా! సుపరిపాలనతో కూడిన ప్రజానుబంధం ద్వారా శ్రీరాముడు మహారాజుగా, ప్రజల రాజుగా ఆరాధించబడ్డాడు. ఇది కల్పిత పురాణం! ప్రజాభిష్టాన్ని గౌరవించి, ప్రజలకు దగ్గరై నిర్మాణాత్మక నిర్ణయాలతో నిలిచి ఎదురొడ్డాడు కాబట్టి వల్లభాయ్ పటేల్ సర్దార్ గా పిలవబడ్డాడు, కీర్తించబడ్డాడు. ఇది కాలమనే సిరాతో లిఖించబడ్డ చరిత్ర!! 

రచయిత: హరికాంత్ (హెచ్ కె)
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios