భర్త చేతిలో ఎయిర్‌హోస్టెస్‌ దారుణహత్య: రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు

By Siva KodatiFirst Published Sep 18, 2020, 3:54 PM IST
Highlights

ఎయిర్‌హోస్టెస్ రీతూ సరీన్ హత్య కేసులో ఆమె భర్త సచిన్‌ ఉప్పల్‌కు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఐదేళ్ల క్రితం ఉప్పల్ పీఎస్ పరిధిలో రీతూ దారుణహత్యకు గురయ్యారు.

ఎయిర్‌హోస్టెస్ రీతూ సరీన్ హత్య కేసులో ఆమె భర్త సచిన్‌ ఉప్పల్‌కు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఐదేళ్ల క్రితం ఉప్పల్ పీఎస్ పరిధిలో రీతూ దారుణహత్యకు గురయ్యారు. అదనపు కట్నం కోసం భార్యను వేధించిన సచిన్... చివరికి ఇంట్లోనే ఆమెను చంపి ఆధారాలు మాయం చేసేందుకు యత్నించాడు.

దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా రెండో అదనపు జిల్లా కోర్టు సచిన్‌ను దోషిగా తేల్చింది. అనంతరం ఆ రోజు తుది తీర్పు వెలువరిస్తూ అతనికి జీవితఖైదు విధించింది. హైదరాబాద్ కోఠీలో ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం చేసే సచిన్ జంషెడ్‌పూర్‌కు చెందిన రీతూను వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో అతనికి వ్యాపారంలో నష్టం రావడంతో భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. అంతటితో ఆగకుండా రీతూకి పుట్టిన బిడ్డ తన వల్లే కలిగాడనడానికి డీఎన్ఏ టెస్ట్ చేయించాలంటూ సూటిపోటి మాటలతో ఆమెను సచిన్ హింసించేవాడు.

ఈ నేపథ్యంలో 19.04.2015న మిత్రుడు కోటగిరీ రమేశ్ కుమార్‌తో కలిసి సచిన్ మద్యం సేవించి ఇంటికి వచ్చారు. ఈ సమయంలో రమేశ్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు గాను ఛానెల్ మార్చాడు.

దీనిపై అభ్యంతరం తెలిపిన రీతూ అతనిని మందలించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సచిన్.. రీతూతో వాగ్వాదానికి దిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో పాటు కోపం తోడవ్వడంతో ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు.

ఈ సమయంలోనే తలకు తీవ్ర గాయాలైన రీతూ మరణించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం రీతూ స్పృహతప్పి పడిపోయిన వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసి భార్య ఆరోగ్యం బాలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు.

దీంతో కంగారుగా అల్లుడి ఇంటికి వచ్చిన వారు రీతూను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. రీతూ తల్లి ఉజాలా ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

click me!