కరోనా ఎఫెక్ట్:హైద్రాబాద్ నుండి వచ్చిన ముగ్గురు 14 రోజులు ఊరి వెలుపలే

By narsimha lodeFirst Published Apr 30, 2020, 10:29 AM IST
Highlights

హైద్రాబాద్ నుండి వచ్చారని ముగ్గురు యువకులను గ్రామస్తులు ఊరిబయటే ఉంచారు. ప్రస్తుతం వీరు గ్రామ సరిహద్దులో ఉన్న పొలాల్లోనే ఉన్నారు. 14 రోజుల వరకు ఎలాంటి కరోనా లక్షణాలు కన్పించకపోతే అప్పుడు గ్రామంలోకి రానిస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు

ఆదిలాబాద్:హైద్రాబాద్ నుండి వచ్చారని ముగ్గురు యువకులను గ్రామస్తులు ఊరిబయటే ఉంచారు. ప్రస్తుతం వీరు గ్రామ సరిహద్దులో ఉన్న పొలాల్లోనే ఉన్నారు. 14 రోజుల వరకు ఎలాంటి కరోనా లక్షణాలు కన్పించకపోతే అప్పుడు గ్రామంలోకి రానిస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రాంపూర్‌గూడకు చెందిన రాథోడ్ రమేష్, పవార్, రమేష్ లు హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వీరు పనిచేస్తున్న కంపెనీలో పనులు నిలిచిపోయాయి. దీంతో హైద్రాబాద్ లో ఉండడానికి ఇబ్బందులు ఎదురై ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. 

పోలీసుల కళ్ళుగప్పి ఆదిలాబాద్ కు లారీలో హైద్రాబాద్ నుండి  వచ్చారు. మంగళవారం నాడు రాత్రి వీరు గ్రామానికి చేరుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న గ్రామస్తులు వారిని గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు.

కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోకి వచ్చిన ఈ ముగ్గురిని గ్రామస్తులు అడ్డుకొన్నారు. ఊరి బయటే నిలిపివేశారు. 

14 రోజుల పాటు గ్రామంలోకి రావద్దని తేల్చి చెప్పారు. 14 రోజుల పాటు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తేలితేనే గ్రామంలోకి రానిస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఈ ముగ్గురు గ్రామానికి సరిహద్దులోని వ్యవసాయ పొలం వద్ద తలదాచుకొన్నారు.

click me!