రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం : 40 ఫైరింజన్లు, గంటల పాటు శ్రమ.. ఎట్టకేలకు అదుపులోకి మంటలు

సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. దాదాపు 40కి పైగా ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.


సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఎట్టకేలకు అదుపులోకి తెచ్చారు. దాదాపు 40కి పైగా ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మరోవైపు భవనంలో చిక్కుకున్న ముగ్గురి ఆచూకీపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. ఇక రేపు బిల్డింగ్ కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అనుమతి లేకుండా మూడు అంతస్తులు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. 

మరోవైపు డెక్కన్ స్టోర్ భవనం ప్రమాదకర స్థితికి చేరుకుంది. భవనం లోపల 3, 4 అంతస్తుల స్లాబులు కుప్పకూలాయి. మంటల ధాటికి రెగ్జిన్ మెటీరియల్స్ భారీగా తగలబడుతున్నాయి. కార్లకు సంబంధించిన ఫైబర్ మెటీరియల్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఫైబర్, సింథటిక్ మెటీరియల్స్ కారణంతో రెండు స్లాబులు కుప్పకూలాయి. ఒక్కొక్క స్లాబ్ కూలుతూ వుండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

Latest Videos

Also Read: రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం: అదుపులోకి రాని మంటలు.. కూలుతున్న స్లాబులు, బిక్కుబిక్కుమంటోన్న స్థానికులు

ఇకపోతే.. అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించారని అన్నారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. 22 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే గోడౌన్‌లో స్టాక్ ఎక్కువగా వుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదని హోంమంత్రి వెల్లడించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ డీజీ నాగిరెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని మహమూద్ అలీ తెలిపారు. భవనంలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినట్లుగా అనుమానిస్తున్నామని మంత్రి చెప్పారు.

అలాగే ఇద్దరు ఫైర్ సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని మహమూద్ అలీ చెప్పారు. కొద్దిగంటల్లోనే మంటలను అదుపు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ , ఫైర్ సిబ్బందితో కలిసి ముందు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

click me!