
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను గులాబీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఇదిలాఉంటే.. సొంత పార్టీలోనూ బండి సంజయ్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని అన్నారు.
సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమనీ, ఆ వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని అన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని ఆయన వెనక్కి తీసుకుంటే బాగుంటుందని, అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడం కంటే దర్యాప్తు సంస్థలు, విచారణ సంస్థలు అడిగిన విషయాలకు సమాధానాలు చెబితే మంచిందని సూచించడం గమనార్హం. అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు తెరమీదికి వచ్చాయని పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అర్వింద్ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. బండి సంజయ్ మీద అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంజయ్ వ్యక్తిగతంగా మాట్లాడలేదని, పార్టీ అధ్యక్షుడు గానే మాట్లాడారని రాజాసింగ్ అన్నారు. అర్వింద్ కు ఏమైనా ఇబ్బంది ఉంటే బండి సంజయ్ తో డైరెక్ట్ గా మాట్లాడాలనీ, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయనతో మాట్లాడొచ్చని అన్నారు. పైగా మీరు ఎంపీ. ఆయనను దిల్లీలో కలుస్తుంటారు. కానీ డైరెక్ట్ మీడియాలో వచ్చి మాట్లాడడం సరికాదనీ, మీరు( అరవింద్ )చెప్పిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఒకరి పై ఒకరు కామెంట్స్ చేసుకోవడం కరెక్ట్ కాదని , తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.
బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. కవితపై విమర్శలు చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, బీఆర్ఎస్ మండిపడింది. ఈ క్రమంలో మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు కూడా ఆదేశించింది. మరోవైపు సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.