
హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వీడి.. బుల్లెట్ బండి ఎక్కి వినూత్న రీతిలో నిరసనకు తెర లేపారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పలుమార్లు సతాయిస్తుందంటూ.. నడవనంటూ మొండికేస్తుందని.. రాజాసించాలా సార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వాహనం రోడ్డు మీద మూడుసార్లు ఆగిపోయింది. ఈ క్రమంలోనే తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని రాజాసింగ్ గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో రాజాసింగ్ వినూత్న రీతిలో నిరసనకు తేరలేపారు. నిన్న ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ గేటు వద్ద వదిలేసి వచ్చారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేడు అసెంబ్లీకి ఎమ్మెల్యే రాజాసింగ్ తన బుల్లెట్ బండి మీద వచ్చారు. బుల్లెట్ బండి మీద వచ్చిన రాజాసింగ్ ను అక్కడి పోలీసులు గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వదిలారు.
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను కలిసిన కేటీఆర్.. ఈటల, రాజసింగ్ తో సరదా సంభాషణ..
ఇక, శుక్రవారం నాడు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ప్రగతి భవన్ కు వెళ్లారు. ఆ వాహనం పదేపదే చెడిపోతుందని, రోడ్డు మధ్యలో ఆగిపోతుందని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని తన బాధ పట్టించుకోవడంలేదని అన్నారు. అందుకే నేరుగా సీఎంను కలిసి తన బాధను వెళ్లగక్కాలని తన వాహనాన్ని మార్చాలని అడగడానికి వచ్చినట్లుగా తెలిపారు. అయితే పోలీసులు ప్రగతి భవన్ దగ్గర రాజా సింగ్ ని అడ్డుకున్నారు.
దీంతో ఆయన తన వెంట తీసుకొచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి పవన్ దగ్గరే వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే పోలీసులు రాజా సింగను అరెస్ట్ చేశారు. అంతకంటే ముందు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత రాజాసింగ్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారుటైరు ఊడిపోయింది. ఇలాగే గతంలో కూడా చాలాసార్లు బుల్లెట్ ప్రూఫ్ కారు సతాయించింది. తన కారును మార్చమని ప్రభుత్వానికి చాలాసార్లు లేఖలు రాశారని… కానీ కారు మార్చడానికి బదులు రిపేర్లు చేసి పంపిస్తున్నారని రాజాసింగ్ వాపోయారు.