Raja Singh : తెలంగాణ బిజెపిలో అధ్యక్ష చిచ్చు... రాజాసింగ్ రాజీనామాతోనే ఆగుతుందా? వీళ్ళ ఆలోచనా ఇదేనా?

Published : Jun 30, 2025, 07:31 PM ISTUpdated : Jun 30, 2025, 07:59 PM IST
Raja Singh

సారాంశం

నూతన రాష్ట్రాధ్యక్షుడి నియామయం తెలంగాణ బిజెపిలో కలకలం రేపింది. రాజాసింగ్ రాజీనామాతో బిజెపిలో అంతర్గత ముసలం బైటపడింది… మరి ఇది ఎక్కడివరకు వెళుతుందో?

Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఇలా ఖరారు కాగానే ఆ పార్టీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ అలా రాజీనామా చేాశారు. బిజెపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాజాసింగ్ ప్రస్తుత బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీచేయాలని రాజాసింగ్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆయనను నామినేషన్ వెయ్యనివ్వకుండా తెలంగాణ బిజెపి సీనియర్లు అడ్డుకున్నారని... దీంతో తీవ్ర అసహానికి గురయిన రాజాసింగ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాజాసింగ్ మాత్రం తన రాజీనామా లేఖలో ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.

బరువైన హృదయంతో బిజెపిని వీడాల్సి వస్తోందని రాజాసింగ్ తన రాజీనామ లేఖలో పేర్కొన్నారు. రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలన్న నిర్ణయం కేవలం తననే కాదు ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలు, మద్దతుగా నిలి చే ఓటర్లను షాక్ కు గురిచేసిందన్నారు. బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చే సమయంలో ఇలాంటి నిర్ణయాలు అనేక అనుమనాలకు తావిస్తున్నాయని రాజాసింగ్ అన్నారు.

తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించే సమర్థత కలిగిన సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలో చాలామంది ఉన్నారు... కానీ కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఇక భవిష్యత్ లో బిజెపి అధికారంలోకి వస్తుందన్న ఆశలు పోయాయని... ప్రజలు కాదు నాయకులే పార్టీని వెనక్కి నెట్టారని రాజాసింగ్ అన్నారు. అందుకే బాధతో రాజీనామా చేస్తున్నానని... దయచేసి ఇక రాజాసింగ్ బిజెపి సభ్యుడు కాదని అసెంబ్లీ స్పీకర్ కు సమాచారం అందించాలని కిషన్ రెడ్డిని కోరారు.

బిజెపిలోంచి బయటకు వచ్చినా హిందుత్వవాదాన్ని విడిచిపెట్టబోనని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ ధర్మానికి, గోషామహల్ ప్రజలకు తన సేవలు కొనసాగుతూనే ఉంటాయని... తన వాయిస్ హిందూ సమాజానికి మద్దతుగా వినిపిస్తూనే ఉంటానన్నారు. బిజెపిని వీడటం బాధాకరమే అయినా తప్పలేదని... మౌనంగా ఉండలేకపోతున్నానని అన్నారు.

తెలంగాణ అధ్యక్ష ఎంపిక విషయంలో బిజెపి అధినాయకత్వం పీఎం నరేంద్ర మోదీ, బిజెపి జాతీయాధ్యక్షులు జెపి నడ్డా, అమిత్ షా, బిఎల్ సంతోష్ లు పునరాలోచించాలని రాజాసింగ్ కోరారు. బిజెపికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు... సరైన నాయకుడిని ఎంపిక చేయాల్సిందని రాజాసింగ్ సూచించారు.

రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం :

బిజెపి ఎమ్మెల్యేగా, కరుడుగట్టిన హిందుత్వవాదిగానే రాజాసింగ్ అందరికి తెలుసు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమయ్యిందో చాలామందికి తెలియదు. రాజాసింగ్ ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ నుండో, ఏబివిపి వంటి విద్యార్థి సంఘాల నుండో రాజకీయాల్లోకి రాలేదు... ఆయన పక్కా రాజకీయ నాయకుడిగానే బిజెపిలో చేరారు.

2009 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో రాజాసింగ్ టిడిపి నుండి మంగళహాట్ కార్పోరేటర్ గా పోటీచేశారు. అయితే ముందుగా బిజెపి నుండే పోటీచేయాలనుకున్నా అక్కడ సీటు దక్కకపోవడంతో టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. ఆయన టిడిపి కార్పోరేటర్ గా ఉన్నా మనసంతా బిజెపిలోనే ఉండేది... దీంతో బిజెపిలో చేరిన అతడు మొదటిసారి 2014 లో గోషామహల్ నుండి పోటీచేసి గెలిచారు.

ఈ గెలుపు తర్వాత రాజాసింగ్ వెనుదిరిగి చూడలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ఇక 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే గతకొంతకాలంగా రాష్ట్ర బిజెపి నిర్ణయాల పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్ష ఎంపిక రాజాసింగ్ లోని అసంతృప్తిని మరింత పెంచి చివరకు రాజీనామాకు సిద్దమయ్యేలా చేసింది.

తెలంగాణ బిజెపిలో ముసలం మొదలైందా?

రాజాసింగ్ రాజీనామాతో బిజెపిలో అతర్గత ముసలం పుట్టినట్లు అర్థమవుతోంది. రామచంద్రరావును బిజెపి బలోపేతం చేయడానికి కాదు ప్రజల్లోకి బలంగా వెళ్లనివ్వకుండా ఉండేందుకు నియమించారని రాజాసింగ్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది తానొక్కడిదే కాదు బిజెపిని రాష్ట్రంలో అధికారంలోకి తేవాలని తాపత్రయపడిన ప్రతిఒక్కరి అభిప్రాయమని రాజాసింగ్ అంటున్నారు.

ఇక రాజాసింగ్ లాగే మరికొందరు బిజెపి నాయకులు కూడా రామచంద్రరావు ఎంపిక పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అధ్యక్ష పదవికి ఆశించిన ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు వంటివారు సైలెంట్ గా ఉన్నా వారి అనుచరులు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కేవలం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి కొందరు నాయకులకే రామచంద్రరావు ఎంపిక నచ్చివుంటుందని అంటున్నారు. మొత్తంగా తెలంగాణ బిజెపిలో నూతన అధ్యక్షుడి నియామకం చిచ్చు పెట్టేసింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?