BJP లో ఇంటి దొంగలంతా ఒక్కటయ్యారు..మరోసారి రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు!

Published : May 31, 2025, 09:18 AM IST
Telangana BJP MLA Raja Singh (Photo/ANI)

సారాంశం

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఇంటిదొంగలంతా ఒక్కటయ్యారని పేర్కొన్నారు.ముఖ్యంగా కరీంనగర్‌ నుంచి తన మీద యుద్ధం మొదలైందని రాజాసింగ్‌ ఆరోపించారు.

తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు వ్యతిరేకంగా కరీంనగర్‌ నుంచి యుద్ధం మొదలైందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రత్యక్షంగా చెప్పకపోయినా, పరోక్షంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తిరిగి సంజయ్‌ పైనే…

ఇప్పటికే గతంలో కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య బండి సంధి కుదిర్చిన విషయం తెలిసిందే. తాజాగా రాజాసింగ్‌ తిరిగి సంజయ్‌పైనే వ్యాఖ్యలు చేయడంతో, కమలదళంలో అంతర్గత కలహాలు మరింత తీవ్రరూపం దాల్చినట్టు కనపడుతోంది.ఇదిలా ఉంటే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన జైలులో ఉన్న సమయంలోనే తన వద్దకు వచ్చిందని ఆమె వెల్లడించారు. తాను పార్టీకి వీడ్కోలు చెప్పేలా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనికి కొనసాగింపుగా, తాను కేసీఆర్‌ను మాత్రమే నాయకుడిగా చూస్తానని, ఇతరుల నాయకత్వాన్ని తాను అంగీకరించనని వ్యాఖ్యానించారు.

నిజమెంత..

ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్, కవిత చేసిన ఆరోపణల్లో నిజమెంత ఉందని అన్నారు. పెద్ద మొత్తంలో ప్యాకేజీ వస్తే తమ నేతలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌తో కలిసిపోతారని విమర్శించారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ తమ నేతలు ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకుని బీజేపీకి నష్టం తెచ్చారని ఆరోపించారు.

ఇక తెలంగాణ బీజేపీలో ఇటీవలి కాలంలో అనేక నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నారు. కిషన్ రెడ్డి ఇటీవల పార్టీ నేతలకు కౌన్సెలింగ్ ఇస్తూ, మీడియాకు వెళ్లేముందు రాష్ట్ర, జాతీయ నేతల దృష్టికి తమ అభిప్రాయాలు తీసుకెళ్లాలని సూచించారు. కానీ ఈ సూచనల్ని నాయకులు పట్టించుకోకపోవడం గమనార్హం.

తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, జూన్ 2న బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో కలవబోతోందన్న వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దుబ్బాక ఎంపీ రఘునందన్ కూడా కవిత కొత్త పార్టీ ప్రారంభించనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యవసానంగా బీజేపీ నేతల వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే స్థితికి చేరుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు పెరుగుతున్న వేళ, నాయకత్వానికి లోబడి ప్రవర్తించకపోతే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశముందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?