హిందువులారా... మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. : రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

By Arun Kumar P  |  First Published Oct 20, 2023, 2:09 PM IST

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందూ పండగల్లో చైనా ఎలక్ట్రిక్ దీపాల వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. మట్టి దీపాలను వాడి మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని కోరారు. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. నిత్యం వివాదాలతో వార్తల్లో వుండే ఆయన ఇటీవల మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో బిజెపి ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటినుండి ఎలాంటి కామెంట్స్ చేయకుండా రాజకీయ మౌనం పాటించిన రాజాసింగ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా యాక్టివ్ అయ్యారు. 

కొద్దిరోజులుగా గోషామహల్ నియోజకర్గంలో రాజాసింగ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలతో మమేకం అవుతూ వారి కష్టసుఖాల గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మట్టి దీపాలను తయారుచేస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లారు రాజాసింగ్. స్వయంగా దీపాలను తయారుచేసిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  

Latest Videos

ప్రస్తుతం దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి... త్వరలోనే దీపావళి పండగ కూడా రానుంది. ఈ నేపథ్యంలో పూజల్లో, ఇతర కార్యక్రమాల్లో మట్టి దీపాలనే వాడాలని రాజాసింగ్ ప్రజలను కోరారు. మన పండగల పూట చైనా ఎలక్ట్రిక్ దీపాలను ఇంటిబయట పెడితే లక్ష్మీదేవి ఆశిస్సులు లభించవని... ఆమె ఇంట్లోకి రాదని గుర్తించాలన్నారు. హిందువులు కేవలం మట్టి దీపాలనే వాడాలని రాజాసింగ్ కోరారు. 

వీడియో

భారత దేశంలో కార్మికులు చాలా కష్టపడి మట్టి దీపాలు తయారుచేస్తారు... అలాంటి  దీపాలను మనం ఉపయోగించకుంటే వారి పొట్టపై కొట్టినవారిమి అవుతామన్నారు. మట్టి దీపాలను వెలిగిస్తేనే లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందన్నారు.  కాబట్టి మన పండగల్లో చైనా వస్తువులను బైకాట్ చేద్దాం... భారత దేశంలో తయారయిన మట్టి దీపాలనే వాడుదామని అన్నారు. ఎలక్ట్రిక్ దీపాలు కాకుండా మట్టి దీపాలు వాడి మన పండగలను సంతోషంగా జరుపుకుందామని చేతులు జోడించి వేడుకుంటున్నాను అని రాజాసింగ్ పేర్కొన్నారు. 
 

click me!