
Raja Singh: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రోజురోజుకు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ ఒకరిపై ఒకరూ విమర్శస్త్రాలు సంధించుకుంటోన్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin OYC) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒవైసీ వంటి వాళ్లకు భారతదేశంలో నివసించే హక్కు లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఈ మేరకు ఓ వీడియోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వినాయక నిమజ్జనం వేళ ట్యాంక్‌బండ్‌పై ఆందోళనలు, ఉద్రిక్తతలు, పార్లమెంట్‌లో మూకదాడి జరుగుతుందంటూ ఒవైసీ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. ఒవైసీ వంటి నేతలకు భారతదేశంలో నివసించే అర్హత లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడంపై కూడా విరుచుకపడ్డారు. ఆ బిల్లు గురించి మాట్లాడే హక్కు ఒవైసీకి లేదని రాజాసింగ్ అన్నారు. ఒవైసీ తన పార్టీలో ఎంతమంది మహిళలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఒవైసీ పార్టీలో మహిళలకు కనీస ప్రాముఖ్యత ఉండదని మండిపడ్డారు. అలాంటి వారు మహిళ బిల్లును ప్రశ్నించడం సరికాదని అన్నారు.
రాహుల్ గాంధీని (RahulGandhi) హైదరాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసరడం పట్ల రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తేనే తమరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. పాముకు పాలు పోసి పెంచినట్లు ఓవైసీ పార్టీని కాంగ్రెస్ పెంచి పోషించిందని ఆరోపించారు. తాను సవాల్ చేస్తున్నననీ, దమ్ముంటే గోషామహల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ధైర్యం లేకపోతే- తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీని అయినా తనపై పోటీకి దింపాలని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసిన డిపాజిట్‌లు కూడా రావని విమర్శించారు