వచ్చేవారం రోజులు తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు.. ఏపీలో కూడా...

By SumaBala BukkaFirst Published Mar 29, 2023, 6:29 PM IST
Highlights

తెలంగాణలో వచ్చే వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల కూడా వర్షాలు పడతాయని తెలిపింది. 

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రాల్లో చాలా చోట్ల వడగల్లు, పిడుగులు  భయాందోళనలు కలిగిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను నీటిపాలు చేస్తున్నాయి. వర్షాల కారణంగా పడుతున్న పిడుగులతో మూగజీవాలు  బలవుతున్నాయి. ఉదయం లేస్తే ఓవైపు ఎండ దంచి కొడుతుండగా..  మరోవైపు సాయంకాలం అవుతూనే చలి చుట్టుకుంటుంది. దీనికి తోడు  ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియక విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. మార్చినెల పోయి ఏప్రిల్ వస్తుందంటే ఎండలు ఎలా తట్టుకోవాలా అని భయపడే వారికి ఓ చల్లటి కబురు ఇది.

వచ్చే ఏడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. పలు ప్రాంతాల్లో  ఈ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర మధ్యప్రదేశ్ లోని మధ్య ప్రాంతాల నుంచి విదర్భ,  తెలంగాణ, రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఈ ఉపరితల ద్రోణి  కొనసాగుతోంది. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఇప్పుడు ఈ వార్తతో మరింత కంగారు పడుతున్నారు.

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడ.. ఎలా.. అంటే..

ఇప్పటికే కురిసిన ఆకాల వర్షాల కారణంగా వడగళ్ల వాన రైతులను కన్నీటముంచింది. తెలంగాణలో ముఖ్యంగా మహబూబాబాద్, జనగాం, వరంగల్ జిల్లాలలో దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఏపీలో కూడా ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అంచనాల మేరకు ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. 

ఇక రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని బయటికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున చెట్ల కింద అస్సలు నిల్చకూడదని హెచ్చరించారు. ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

click me!