రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్షాలు..

By Sumanth KanukulaFirst Published May 22, 2022, 5:22 PM IST
Highlights

తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. ఇక, నిన్న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. 

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2 సెం.మీ,  బంట్వారంలో 11 సెం.మీ, దుద్యాలలో 10.2 సెం.మీ వర్షం కురిసింది. మరోవైపు శనివారం కొమురం భీం జిల్లాలోని కౌటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

ఇక, రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. వర్షాల తీవ్రత సోమవారం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

click me!