బీజేపీ, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. బస్సు యాత్రలో భాగంగా జగిత్యాలలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
జగిత్యాల:తమ పార్టీ నేతలంతా పులులే... కేసీఆర్ ఆటకట్టించడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ బస్సు యాత్ర మూడో రోజు జగిత్యాలకు చేరుకుంది. కరీంనగర్ నుండి జగిత్యాలకు రాహుల్ గాంధీ శుక్రవారం నాడు ఉదయం చేరుకున్నారు. జగిత్యాలలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు.అడవుల్లో అక్కడకక్కడ పులులు కన్పిస్తాయన్నారు. ఇక్కడ ఎన్ని పులులు శాంతంగా కూర్చున్నాయో చూస్తున్నారన్నారు. తమ పార్టీ పులులు కేసీఆర్ సర్కార్ ను గద్దెదించుతాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన చేపడుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.కులగణన అనేది దేశానికి ఎక్స్ రే లాంటిందని ఆయన అభిప్రాయపడ్డారు.
బడ్జెట్ కేటాయింపు చేసేది కూడ 90 శాతం అగ్రవర్ణ అధికారులేనని రాహుల్ చెప్పారు.ఓబీసీల జనాభా ఎంతో ఎందుకు లెక్కలు తీయడం లేదని రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. బడ్జెట్ లో ఓబీసీలకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆలోచించాలని ఆయన ప్రశ్నించారు.బడ్జెట్ లో ఓబీసీలకు 5 శాతమే కేటాయిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు.ఓబీసీలు దేశానికి వెన్నెముక లాంటి వారన్నారు.
దేశంలో, రాష్ట్రంలో ఓబీసీలు 50 శాతం వరకు ఉన్నారని రాహుల్ గాంధీ చెప్పారు. కుల గణన వల్లే సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతాయని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఓబీసీలకు అండగా నిలిచేందుకు మోడీ, కేసీఆర్ సిద్దంగా లేరని రాహుల్ గాంధీ విమర్శించారు.బలహీనవర్గాలకు ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ ముందుకు రావడం లేదన్నారు. బలహీనవర్గాల జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులుంటాయని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రోగ నిర్ధారణ చేశాకే రోగికి చికిత్స అందించాలని ఈ ప్రభుత్వాలు మరిచాయన్నారు.
also read:సీట్ల సర్ధుబాటుపై చర్చించలేదు, మా మద్దతు కోరారు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
తెలంగాణలో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరే ఈ ఎన్నికలు అని రాహుల్ గాంధీ చెప్పారు.తెలంగాణకు రాజు మాదిరిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. దొరల కోసం తాము తెలంగాణను ఏర్పాటు చేయలేదన్నారు. ప్రజల కోసం తెలంగాణ ఏర్పాటు చేసినట్టుగా రాహుల్ గాంధీ వివరించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే పసుపు మద్దతు ధరను రూ. 15 వేలకు పెంచుతామన్నారు.ఈ ప్రాంతంలోని చెరుకు ఫ్యాక్టరీలను పునరుద్దరిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రజలతో తమ పార్టీకి ప్రేమ, అనుబంధం ఉందన్నారు.నెహ్రు, ఇందిర, రాజీవ్, సోనియా నుండి తమకు ప్రజలతో మంచి అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ కు, ప్రజలకు మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాల కాలం నాటిదని రాహుల్ గాంధీ చెప్పారు.
చిరు వ్యాపారి వద్ద దోశ వేయడం తనకు చాలా సంతోషం కల్గించిందని రాహుల్ గాంధీ చెప్పారు.బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశాక ఢిల్లీలోని తన ఇంటిని ఖాళీ చేయించారన్నారు. తన ఇల్లు దేశ ప్రజల హృదయాల్లో ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులను అదానీ జేబులోకి పంపేలా చేస్తున్నారని రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు