
చివరి విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిశాయి. ఇలా మొత్తంగా పలు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ కు సెమిఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందన్నది సర్వేలన్ని చెబుతున్నాయి. అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కూమార్ రెడ్డి కి కూడా ఒకే భయం పట్టుకుంది. అది ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై.
ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలు ప్రజల ఓట్లు నమోదైన ఈవీఎంలతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని రాహుల్ శుక్రవారం సాయంత్రమే ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉత్తమ్ కూడా ఇవాళ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మిత్ర పక్షాలు ఈవీఎం లలో ఎలాంటి అవతవకలు జరక్కుండా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.
ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూం కు వెళ్లాల్సిన ఈవీఎం యంత్రాలు మధ్య ప్రదేశ్ లో విచిత్రంగా వ్యవహరించాయంటూ రాహుల్ ట్వీట్ చేశారు. కొన్ని రెండు రోజుల తర్వాత స్ట్రాంగ్ రూం కు చేరుకుంటే మరికొన్ని హోటళ్లలో దర్శనమిచ్చాయన్నారు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ఫలితాలు వెలవడే వరకు జాగ్రత్తగా ఉండాలని రాహుల్ సూచించారు.
ప్రజల ఓట్లు నిక్షిప్తమైన ఈవీఎంలపై ప్రజాకూటమి అభ్యర్థులు ఓ కన్నేసి ఉంచాలని ఉత్తమ్ కూడా ట్వీట్ చేశారు. ఈవీఎంల రవాణా సమయంలో, భద్రపరిచే సమయంలో ఎలాంటి అక్రమాలు జరక్కుండా చూడాలని సూచించారు. ఈ ఈవీఎంలను భద్రపరిచే గదులపై కూడా ఓ కన్నేయాలన్నారు. అలాగే స్ట్రాంగ్ రూం నుండి కౌటింగ్ కేంద్రాలకు తరలించే వారికి వాటిపై దృష్టి పెట్టాలని ఉత్తమ్ ప్రజాకూటమి శ్రేణులకు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.