
హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ విజయంతో కొత్త ఉత్తేజాన్ని నింపుకున్న కాంగ్రెస్ మరో దక్షిణాది రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారాన్ని సాధించాలని కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఓటమి నైరశ్యాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో స్థైర్యం నింపింది. కర్ణాటక విజయంతో ఇది ద్విగుణీకృతమైంది.
రాజకీయాల్లో పాదయాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలు.. జగన్ పరామర్శ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు విజయవంతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్రలతో ప్రజలకు ఎంతో చేరువైంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే భారత్ జోడో యాత్రతో ప్రేరణ పొంది హాథ్ సే హాథ్ జోడోను టీ కాంగ్రెస్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ప్రారంభించారు.
అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని, ముఖాముఖి మాట్లాడుతూ, సభలు పెడుతూ.. ప్రజలతో నడుస్తూ భట్టివిక్రమార్క ప్రజలకు చేరువయ్యారు. మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర 25వ తేదీన 101 రోజుల తర్వాత ఖమ్మంలో ముగిసిపోనుంది.
Also Read: Opposition Unity: విపక్షాల కూటమిలోకి బీఆర్ఎస్? అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్ణయం వాయిదా!
ఖమ్మంలో భారీ సభతో పీపుల్స్ మార్చ్ ముగింపు సభను కాంగ్రెస్ నిర్వహిస్తున్నది. ఈ సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకాబోతున్నారు. ప్రియాంక గాంధీ కూడా వస్తున్నట్టు ఖమ్మం కాంగ్రెస్ అధ్యక్షుడు జావీద్ వెల్లడించారు. ఈ యాత్రలో భాగంగానే మంచిర్యాలలో నిర్వహించిన సభకూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రావడం గమనార్హం.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగుతున్నప్పుడూ రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి ఈ పాదయాత్ర గురించి ఆరా తీశారు. ప్రజల నుంచి ఆదరణనూ అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, కర్ణాటక కాంగ్రెస్ నేతలూ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. డీకే శివకుమార్ కూడా ఈ యాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డీకే శివకుమార్‌కూ కాంగ్రెస్ అధిష్టానం అబ్జర్వర్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నది. అంతేకాదు, అందుకోసం ఇప్పటికే వ్యూహాలు అమలు చేస్తున్నది.