
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటన వాయిదా పడింది. ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ గర్జన సభ చేపట్టాలని నిర్ణయించిన తెలంగాణ పీసీసీ.. అందుకు రాహుల్ గాంధీని ఆహ్వానించింది. అయితే తాజాగా ఈ సభను వాయిదా వేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈడీ విచారణ, పార్లమెంట్ సమావేశాలు, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరైన సమావేశంలో సిరిసిల్లలో రాహుల్ సభను వాయిదా వేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సిరిసిల్లలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కొత్త తేదీలను కాంగ్రెస్ పార్టీ త్వరలో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిరిసిల్లలో కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహిస్త, రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్‌ఛార్జ్, పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు ఎంపీలు హాజరుకావాల్సి ఉంటుందని సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఐదుగురు ఎంపీలను బహిరంగ సభకు పంపడం పార్టీకి కష్టమేనని ఆయన అన్నారు.
ఇక, ఆగస్టు 2న సిరిసిల్లలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సభ నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం చేపట్టబోతున్న కార్యాచరణ ను డిక్లరేషన్ రూపంలో రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ఇంట్లో వాళ్లకి మా త్రమే ఉద్యోగాలు వచ్చాయని.. రాష్ట్రం కోసం పోరాడిన యువతకు ఎలాంటి ఉద్యోగాల్లేవని విమర్శించారు.