తెలంగాణలో రెండో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర.. మూడు రోజుల విరామం తర్వాత పున:ప్రారంభం

By Sumanth Kanukula  |  First Published Oct 27, 2022, 9:28 AM IST

తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. మూడు రోజులు విరామం తర్వాత గురువారం రాహుల్ తన పాదయాత్రను పున:ప్రారంభించారు.


తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. మూడు రోజులు విరామం తర్వాత గురువారం రాహుల్ తన పాదయాత్రను పున:ప్రారంభించారు. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. రోడ్డు మార్గాన మక్తల్ చేరుకున్నారు. అక్కడి పాదయాత్ర శిబిరంలో బస చేసిన రాహుల్ గాంధీ.. గురువారం తెల్లవారుజామున మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ వద్ద నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర ఇవాళ 26.7 కి.మీ మేర సాగనుంది. 

ఈరోజు రాహుల్ పాదయాత్ర.. కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, దండు క్రాస్ రోడ్డు మీదుగా కచ్వార్ గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం జాక్లార్ క్రాస్ రోడ్డు మీదుగా గుడిగండ్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ ఉంటుంది. అనంతరం ఈ రోజు రాత్రి ఎలిగండ్లలో రాహుల్ గాంధీ బస చేస్తారు.

Latest Videos

రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు.. ఆయనకు మద్దతు తెలిపారు. రాహుల్ పాదయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. రాహుల్ పాదయాత్రలో పాల్గొనేందుకు పలువరు ప్రతినిధులను ఎంపిక చేసింది. 

ఇక, రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహం తీసుకురావడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో రాహుల్ పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ నెల 23న రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలోని రాయచూర్ నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మక్తల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అయితే దీపావళి పండగ, కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నేపథ్యంలో.. రాహుల్ పాదయాత్రకు ఈ నెల 24,25,26 తేదీల్లో విరామం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రాహుల్ గాంధీ... బుధవారం రాత్రి తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. 

తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 12 రోజుల్లో 375 కిలోమీటర్ల మేర గాంధీ పాదయాత్ర చేయనున్నారు. నవంబర్ 4న ఒకరోజు సాధారణ విరామం ఉండనుంది. నవంబర్ 7న రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. అయితే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో కంటే.. తెలంగాణలో రాహుల్ యాత్రను సూపర్ సక్సెస్‌ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. 

నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో భారీ బహిరంగ సభకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే.. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో రాహుల్ పూజలు నిర్వహించేలా పార్టీ ప్రణాళిక రూపొందింది. యాత్ర మార్గంలోని పలు దేవాలయాలు, మసీదులను కూడా రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్రను సమన్వయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.

click me!