ఆపరేషన్ ఆకర్ష్ : ఫోన్లలో ఎవరితో మాట్లాడించాలనుకున్నారు? అవతలి వ్యక్తులు ఎవరు??

By SumaBala Bukka  |  First Published Oct 27, 2022, 8:50 AM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడానికి ప్రయత్నించిన కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అవతల ఫోన్లలో ఎవరితో మాట్లాడించాలనుకున్నారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 


హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురు చేసిన ఫోన్ కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి  ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలు నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి లను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహ యాజులు స్వామి, రామచంద్ర భారతి, నందకుమార్ లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. 

రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో ఉన్న తన ఫాంహౌస్లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు,  పోలీసులు మంగళవారం సాయంత్రం ఫామ్ హౌస్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్ తో పాటు ఆరు చోట్ల రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. 

Latest Videos

యాదాద్రిలో ప్రమాణానికి కేసీఆర్ సిద్ధమా?... ఢిల్లీలో స్వామీజీలతో మాట్లాడాకే మాస్టర్ ప్లాన్... బండి సంజయ్...

బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారువేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా..  సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆ పై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతి అదుపులోకి తీసుకున్నారు.

గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు…
సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద ఆ ముగ్గురు, సోఫాలో ఎమ్మెల్యేలు నలుగురు కూర్చున్నారు. ఈ మీటింగ్ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అయితే, ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న ఓ కేంద్ర పెద్దతో మాట్లాడించాలని ప్రయత్నించారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది.

మూడు రోజులు 70 మంది పోలీసులు..
ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది ఈ 3 రోజులు పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 74 సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు.  గంటన్నరపాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డ్ అయింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు, టి ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి, అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం మండలంలో శ్రీ మంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకుని తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. ఇక్కడ తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది 

డబ్బు తెచ్చింది  నందూ యేనా?
రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్ లోని ఓ ఆలయ పూజారి.  కాగా,  కర్ణాటకకు చెందిన నందకుమార్ నగరానికి వలస వచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారా హిల్స్ ప్రాంతంలో సదరన్ స్పైస్ పేరుతో ఓ రెస్టారెంట్ నడిపాడు.  ఫిల్మీ జంక్షన్ అనే రెస్టారెంట్ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముకుడితో విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత అవినాష్ అనే వ్యక్తితో కలిసి మాణిక్ చంద్ పాన్ మసాలా వ్యాపారం చేశాడు.

తరువాత, మాణిక్ చంద్ బ్రాండ్ ను తన అధీనంలోకి తీసుకొన్నాడు.  ప్రస్తుతం తెలంగాణతోపాటు ఏపీలోనూ సౌత్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. వీటితోపాటు నగరంలోని అనేక పబ్బులు,  రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజాప్రతినిధులు పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని హవాలా ఆపరేటర్ అని కూడా తెలిసింది. బుధవారంనాడు పుట్టిన రోజు కావడంతో ఈ ఫాంహౌస్ పార్టీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్ కావడంతో డబ్బు తీసుకు వచ్చింది నందుయేనా?  అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా నిందితులు ముగ్గురుని పోలీసులు ఫామ్హౌస్ నుంచి తరలించారు. 

click me!