
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మీరు ఎవరికీ నివాళులర్పించారో తెలుసా? అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా రాహుల్‌పై కేటీఆర్ విమర్శలను కురిపించారు.
తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ కేసీఆర్‌పై, టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మీరు నివాళి ఎవరికి అర్పించారో తెలుసా? అని రాహుల్ ను కేటీఆర్ అడిగారు.1969 నాటి ఉద్యమం సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపించిన వారికే మీరు నివాళులర్పించారని కేటీఆర్ గుర్తు చేశారు.
మీడియా స్వేచ్ఛ గురించి, అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కసారి ఎమర్జెన్సీ విధించిన చరిత్ర మీ కాంగ్రెస్‌ది కాదా? ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది మీ పార్టీ కాదా? అని కేటీఆర్ రాహుల్‌ను ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం త్వరితగతిన పనులను చేస్తుండగా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు మీ పార్టీ నేతలు కేసులు వేశారని కేటీఆర్ రాహుల్‌కు గుర్తు చేశారు. ప్రాజెక్టులపై వేసిన కేసులను ఉపసంహరింపజేయాలని మీ పార్టీ నేతలకు మీరు హైద్రాబాద్ నుండి తిరిగి వెళ్లే ముందైనా సూచిస్తే బాగుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. లేకపోతే అభివృద్ధిని అడ్డుకునే పార్టీగా కాంగ్రెస్‌పై ప్రజలు శాశ్వత ముద్ర వేస్తారని హెచ్చరించారు.
అవినీతి గురించి రాహుల్ మాట్లాడటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ‘వేదికపై మీ చుట్టూ కూర్చున్న వారిలో సగం మంది సీబీఐ కేసుల్లోనో, అవినీతి కేసుల్లోనో చిక్కుకుని బెయిల్‌పై వచ్చారు. అన్నట్టు మరిచిపోయా.. మీది స్కాం కాంగ్రెస్ పార్టీ కదా! ఏ ఫర్ ఆదర్శ్.. బీ ఫర్ బోఫోర్స్.. సీ ఫర్ కామెన్వెల్త్.. ఇంకా చెప్పాలా సర్..? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.