
దేశం మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫీవర్‌తో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులు తమ జట్లను, అభిమాన ఆటగాళ్ల ఆటను చూసేందుకు గ్రౌండ్లకు పోటెత్తుతున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రాచకొండ పోలీసులు నకిలీ ఐపీఎల్ టికెట్ల ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ మేరకు గురువారం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు.
ALso Read: నకిలీ ఐపీఎల్ టికెట్లు విక్రయం.. రాచకొండ పోలీసుల అదుపులో ముఠా , తీగ దొరికిందిలా..?
దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ చౌహాన్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఆరుగురు నిందితులు 200 నకిలీ టికెట్లు తయారు చేశారని తెలిపారు. 132 నకిలీ టికెట్లు విక్రయించారని.. వీటిలో 68 సీజ్ చేశామన్నారు. నిందితుడు గోవిందరెడ్డి ఈవెంట్ ఆర్గనైజర్ అని రాచకొండ సీపీ వెల్లడించారు. గోవిందరెడ్డి అక్రిడిటేషన్‌లోని బార్‌కోడ్‌ను కాపీ చేశారని చౌహాన్ పేర్కొన్నారు. బార్ కోడ్‌ను కాపీ చేసి నకిలీ ఐపీఎల్ టిక్కెట్లను సృష్టించారని సీపీ తెలిపారు. నిందితులు ఎవరెవరికి టికెట్లు విక్రయించారో దర్యాప్తు చేస్తున్నామని చౌహాన్ పేర్కొన్నారు.