నెల రోజులుగా.. నిద్రాహారాలు మాని పబ్‌‌జీ: పడిపోయిన కాలు, చేయి

By narsimha lodeFirst Published Sep 1, 2019, 3:53 PM IST
Highlights

మహబూబ్‌నగర్‌కు చెందిన కేశవర్థన్ అనే కుర్రాడు దాదాపు నెల రోజుల నుంచి పగలు అన్న తేడా లేకుండా పబ్‌జీ గేమ్ ఆడాడు. చివరికి మెదడుపై తీవ్ర ఒత్తిడి పడి పరిస్ధితి విషమంగా మారింది. కుడికాలు, కుడి చేయి కదపలేని స్ధితికి చేరడంతో కేశవర్థన్‌ను సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు.

ఇక పబ్ ‌జీ గేమ్‌కి బానిసైన ఓ కుర్రాడు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మరింత విచారకరం. వనపర్తి జిల్లాకు చెందిన కేశవర్థన్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లితో కలిసి వుంటున్న ఈ కుర్రాడు దాదాపు నెల రోజుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా సెల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు.

రాత్రిపూట దుప్పటి కప్పుకుని మరి ఆడుకోవడంతో.. పిల్లాడు పడుకున్నాడు కదా అని తల్లి అనుకునేది. చివరికి భోజనానికి రమ్మన్నా వద్దు అనేవాడు. అయితే సమయానికి మంచినీరు, ఆహారం తీసుకోకపోవడంతో కేశవర్ధన్ అరోగ్యం తీవ్రంగా క్షీణించింది.

వారం క్రితం జ్వరంతో పాటు వాంతులు రావడంతో కంగారుపడిన తల్లి కుర్రాడిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయినప్పటికీ రెండు, మూడు రోజులు జ్వరం తగ్గలేదు. చివరికి మెదడుపై తీవ్ర ఒత్తిడి పడి పరిస్ధితి విషమంగా మారింది.

కుడికాలు, కుడి చేయి కదపలేని స్ధితికి చేరడంతో కేశవర్థన్‌ను సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యుల బృందం.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి కారణంగా శరీరంలో సోడియం, పోటాషియం నిల్వలు తగ్గి మెదడుపై పెను ప్రభావం చూపిందని వైద్యులు తేల్చారు.

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడినట్లు గుర్తించారు. చికిత్స అనంతరం యువకుడిని డిశ్చార్జి చేసిన వైద్యులు పబ్‌జీతో పాటు ఎలాంటి వీడియో గేమ్ ఆడకుండా చూడాలని కేశవర్ధన్ తల్లికి చెప్పి పంపారు. 
 

click me!